Begin typing your search above and press return to search.

అత‌డు టీడీపీని స్వాధీనం చేసుకోవాలి: ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:30 AM GMT
అత‌డు టీడీపీని స్వాధీనం చేసుకోవాలి: ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ హైద‌రాబాద్‌లో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించి ఉంటార‌ని వైఎస్సార్సీపీ నేత‌ కొడాలి నాని, బీజేపీ నేత‌లు ఎంపీ జీవీఎల్ వంటివారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ తెలుగు అకాడ‌మీ చైర్మ‌న్ నంద‌మూరి లక్ష్మీపార్వతి కోరారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని కూడా స్వాధీనం చేసుకోవాల‌న్నారు. అదే తన కోరిక అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వ‌తి హాట్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచార‌ని గుర్తు చేశారు. త‌ద్వారా టీడీపీని లాక్కున్నారంటూ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే.. పార్టీని సమర్థవంతంగా నడిపించగలర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కాగా చంద్రబాబు ప్ర‌భుత్వ‌ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశార‌ని ల‌క్ష్మీపార్వ‌తి మండిప‌డ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల స్కూల్స్ మూత పడ్డాయని ధ్వ‌జ‌మెత్తారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా వ్య‌వ‌హారిక భాషోద్య‌మ పితామ‌హుడు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నంద‌మూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఆగ‌స్టు 25న తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివర్సిటీ వేదికగా తెలుగు బాషా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిడుగు బాషా ఉత్సవాల సందర్భంగా ఆరుగురికి పుర‌స్కారాలు అందిస్తామ‌న్నారు.

కాగా.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైర‌ల్ గా మారాయి. కాగా.. ఇప్పటివరకు ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై కీలక విషయాలేవీ బయటకు రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా.. ఎన్టీఆర్ నటనను అభినందించారని.. దీనిలో భాగంగా ఆయనతో చర్చించినట్లు చెప్పుకువ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీపార్వ‌తి పూర్తి భిన్నంగా వ్యాఖ్య‌లు చేశారు.