Begin typing your search above and press return to search.

మంత్రి ఎర్రబెల్లి వడ్డాణం కామెంట్స్ కు లక్ష్మీపార్వతి కౌంటర్

By:  Tupaki Desk   |   23 Aug 2022 12:30 PM GMT
మంత్రి ఎర్రబెల్లి వడ్డాణం కామెంట్స్ కు లక్ష్మీపార్వతి కౌంటర్
X
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తనకు టీడీపీలో ఉండగా ఇన్నేళ్లు ఎందుకు మంత్రి పదవి రాలేదో వివరించారు. ఈక్రమంలోనే అప్పట్లో ఆమె వడ్డాణం చేయిస్తే మంత్రి పదవి ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చిందని.. కానీ తాను చేయించలేదని ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. లక్ష్మీపార్వతిని ఉద్దేశించి ఎర్రబెల్లి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఎర్రబెల్లి వడ్డాణం కామెంట్స్ పై లక్ష్మీపార్వతి తాజాగా కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో తనకు వడ్డాణం ఇవ్వనందుకే ఎర్రబెల్లికి మంత్రి పదవి రాలేదని.. 27 ఏళ్ల తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించడం విడ్డూరంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ లో వైశ్రాయ్ హోటల్ లో ప్రధాన పాత్ర పోషించిన ఎర్రబెల్లికి చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు భార్య కూడా వజ్రాలు, వైఢూర్యాలు, వడ్డాణాలు అడిగారా? అందుకనే మంత్రి పదవి రాలేదా? అంటూ లక్ష్మీపార్వతి కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అంటూ ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు. ఇలాంటి ఎర్రబెల్లి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని.. విశ్వాస ఘాతకులు, ఎన్టీఆర్ హంతకులంతా మళ్లీ కలుస్తున్నారని హెచ్చరించారు.

చంద్రబాబును సీఎంను చేయడానికి ఇద్దరు మీడియా అధినేతలు నిర్వహించిన పాత్రను ఆడియోలు, వీడియోల ద్వారా అప్పట్లోనే ఎన్టీఆర్ లోకానికి తెలియజేశారని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి ఇప్పటికీ టీడీపీ పురిటి కంపును వదుల్చుకోలేదని.. తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక ఈ ప్రకటన చేస్తున్నానని లక్ష్మీపార్వతి అన్నారు.

ఎర్రబెల్లి నిజంగా మనిషైతే గుడిలో దేవుడు ముందు తన బిడ్డలు, మనవలపై ప్రమాణం చేసి తాను అతడిని వడ్డాణం అడిగానని చెప్పగలరా? అని లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోలేక ఆర్తిక సమస్యలతో బాధపడుతున్న తనను సీఎం వైఎస్ జగన్ ఓ బిడ్డలా ఆదుకొని నిలబెట్టాడని అన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణతో ఇటీవల ఎర్రబెల్లి ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.. ‘‘నీకు మంత్రి పదవి ఇప్పిస్తా.. నాకు వడ్డాణం కొనియ్యాలె’’ అని లక్ష్మీపార్వతి అడిగిందని ఎర్రబెల్లి సంచలన విషయాన్ని లీక్ చేశారు. నీకు దండం పెడుతా.. అలాంటివి కొనియ్య అని చెప్పిన అని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి వివాహాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ నన్ను పిలిచి నా చేతనే దండులు మార్చుకున్నారని ఎర్రబెల్లి పాత సంగతులు గుర్తు చేసుకున్నాడు. దీనికి కౌంటర్ గానే లక్ష్మీపార్వతి ఈరోజు స్పందించింది.