Begin typing your search above and press return to search.
రాజకీయ అరంగేట్రంపై లక్ష్మీనారాయణ క్లారిటీ!
By: Tupaki Desk | 26 April 2018 12:44 PM GMT1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ 7 సంవత్సరాల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరణ చేస్తున్నానని ప్రకటించడం కొద్ది రోజుల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణ ....తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటేషన్ పై సీబీఐ జేడీగా పనిచేసిన ఆయన కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుతో పాటు పలు కీలకమైన కేసులలో దర్యాప్తు చేసి ప్రభుత్వంతోపాటు ప్రజల మన్ననలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా, ఆయన రాజీనామాను మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో రాజీనామా ఆమోదం తర్వాత లక్ష్మీనారాయణ తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు లక్ష్మీనారాయణ తెరదించారు.
లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన వెంటనే ఆయన రాజకీయాల్లోకి రాబోతోన్నారని ప్రచారం జరిగింది. అయన సొంతంగా పార్టీ స్థాపిస్తారని కొందరు....పార్టీ స్థాపించి బీజేపీ - టీడీపీ - జనసేనలలో ఒక పార్టీకి మద్దతిస్తారని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా, గుంటూరు జిల్లా యాజిలిలో రైతులతో లక్ష్మీనారాయణ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సమావేశంలో లక్ష్మీ నారాయణ తన మనసులో మాటను బయటపెట్టారు. రైతుల అభివృద్ధి కోసం - గ్రామాల అభివృద్ధి కోసమే తన పదవికి రాజానామా చేసి ప్రజల్లోకి వచ్చానని లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. గ్రామాల్లో పని చేస్తా...సమాజసేవ చేస్తా అంటే ప్రభుత్వం అంగీకరించలేదని...అందుకే రాజీనామా చేసి బయటకు వచ్చానని ఆయన అన్నారు. యాజలి నుంచే తన యాగాన్ని ప్రారంభిస్తానని, రైతులతో తన ప్రయాణం మొదలవడం సంతోషంగా ఉందని అన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని, ధృఢ సంకల్పంతో అందరం ముందుకు పోవాలని, చిత్తశుద్ధితో ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యమని ఆయన అన్నారు.