Begin typing your search above and press return to search.

లాల్ బహ్ దూర్ శాస్త్రి ఎలా చనిపోయారు ?

By:  Tupaki Desk   |   14 Oct 2015 6:40 AM GMT
లాల్ బహ్ దూర్ శాస్త్రి ఎలా చనిపోయారు ?
X
అజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ గురించి ప్రతి అంశమూ భారతీయులకే కాదు ప్రపంచంలో చాలామందికి ఆసక్తే.... ఇటీవల బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను వెల్లడించడంతో మరోసారి నేతాజీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే... ఆయన విమాన ప్రమాదంలో మృతిచెందలేదనీ అంటుంటారు... తాజాగా ఆయన గురించి ఇంకో అంశం చర్చనీయాంశమవుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారని... ఆయనను భారత్ కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారని.. అప్పట్లో శాస్త్రి తాష్కెంట్ పర్యటన వెనుక దీనిపై చర్చించే ఉద్దేశమూ ఉందన్న వాదనా ఉంది. తాజాగా లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థ సింగ్ నేతాజీకి సంబంధించి వెల్లడించిన అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.

లాల్ బహుదూర్ శాస్త్రికి నేతాజీ పట్ల ఆరాధ్య భావం ఉండేదంటున్న సిద్ధార్థ... శాస్త్రి తాష్కెంట్ పర్యటన నాటి సంఘటనను మీడియాకు చెప్పారు... ఒక ముఖ్య వ్యక్తిని తిరిగి భారత్ కు రప్పించేందుకు తన తాత లాల్ బహదూర్ శాస్త్రి సోవియెట్ యూనియన్ కు చెందిన కీలక వ్యక్తులతో చర్చలు జరిపారని తన తండ్రి ద్వారా తనకు తెలిసిందని ఆయన అంటున్నారు. ఆ ముఖ్యవ్యక్తి పేరేంటో తన తండ్రి చెప్పలేదని... అయితే... దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి అని చెప్పడంతో నేతాజీయేనని తాము అర్థం చేసుకున్నామన్నారు. కేంద్రం బోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లు వెల్లడించాలని ఆయన అన్నారు.

కాగా బోస్ లాగే శాస్త్రి మృతిపైనా దేశంలో ఎన్నో అనుమానాలున్నాయి. తాష్కెంట్ లో చోటుచేసుకున్న సంఘటనల పూర్వాపరాలు వెల్లడించాలని శాస్త్రి కుటుంబసభ్యులు గతంలో డిమాండ్ చేశారు. నేతాజీని తిరిగి భారత్ రప్పిస్తున్న శాస్త్రి ప్రయత్నించడంతోనే ఆయన్ను విష ప్రయోగంతో చంపేశారని అప్పట్లో కాంగ్రెస్ వ్యతిరేకులు అనేవారు.

మొత్తానికి బోస్ కు సంబంధించి శాస్త్రి మనవడు చెప్పిన కీలకాంశాలు కొట్టిపారేయవలసినవి కావని పలువురు అంటున్నారు.