Begin typing your search above and press return to search.

అతను ట్వీటుతుంటే తడిసిపోతున్నాయిక్కడ!

By:  Tupaki Desk   |   12 July 2015 6:29 PM GMT
అతను ట్వీటుతుంటే తడిసిపోతున్నాయిక్కడ!
X
భారత రాజకీయ నేతలు చాలామందికి ఇప్పుడు ట్విట్టర్ ఫోబియా పట్టుకుంది. అక్కడ ఓ ట్వీట్ పడుతుంటే.. ఇక్కడ ఒక్కొక్కరికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. ఇందులో అధికార పక్షం, ప్రతిపక్షం అని తేడా లేదు. వాళ్లూ వీళ్లూ అని లేకుండా అందరినీ తన ట్వీట్లతో రఫ్ఫాడుకుంటున్నాడు ఘరానా మోసగాడు లలిత్ మోడీ. రోజుకో ట్వీట్‌తో తనకు అంటిన మకిలిని అధికార, ప్రతిపక్ష నాయకులందరికీ కూడా అంటిస్తూ.. అతను సాగిస్తున్న పోరాటం గత నెల రోజులుగా భారతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అతను కొన్నాళ్లుగా తన ట్వీట్లతో ఎవరెవరిని ఎలా ఇరికించాడో ఓసారి చూద్దాం పదండి.

* లలిత్ మోడీ ట్విట్టర్ రాజకీయం ముందుగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో మొదలైంది. 2011లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్.. తన భార్య సర్జరీ కోసం తాను పోర్చుగల్ వెళ్లేందుకు సహకరించారని జూన్‌లో ట్వీట్ చేసి తేనెతుట్టెను కదిపాడు లలిత్ మోడీ. దీంతో ప్రస్తుతం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చూస్తున్న సుష్మకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మానవతా దృక్పథంతోనే తానీ సాయం చేశానని సుష్మ బుకాయించినా.. సుష్మ భర్త, కుమార్తె తన తరఫున లాయర్లుగా కోర్టులో వాదించినట్లు కూడా మోడీ వెల్లడించడంతో మంత్రిగారు మరింత చిక్కుల్లో పడ్డారు.

* సుష్మ ఇలా జుట్టు పీక్కుంటుండగానే.. భాజపాలో మరో మహిళా నేత సీటు కిందికి నీళ్లు వచ్చేలా మరో ట్వీట్ చేశాడు మోడీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే బ్రిటన్లో తన ఇమ్మిగ్రేషన్‌కు లిఖిత పూర్వకంగా సహకరించారని ట్వీట్ చేశాడు మోడీ. రాజే సంతకాన్ని సూచిస్తూ ఆ లేఖను కూడా ట్విట్టర్లో పెట్టాడు మోడీ. వసుంధర కుటుంబంతో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలు కూడా బయటికి రావడంతో వసుంధర పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. భాజపా అగ్ర నాయకులు ఇప్పటికే ఆమె తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మోడీ ట్వీట్ వసుంధర సీఎం పదవికే ముప్పు తెచ్చేలా ఉంది.

* సుష్మ, రాజేలను ఇరికించడంతో పండగ చేసుకుంటున్న కాంగ్రెస్‌కు కూడా మోడీ బెడద తప్పలేదు. నేరుగా గాంధీల కుటుంబంపైనే ఫోకస్ పెట్టాడు మోడీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లండన్లో తన ఆతిథ్యం స్వీకరించినట్లు ఈ నెల 4న ట్వీట్ చేసి సంచలనం రేపాడు మోడీ. రాహుల్‌తో పాటు ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా తన ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. వీళ్లందరితో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్విట్టర్లో పెట్టాడు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. బీజేపీపై విమర్శలు మాని.. తన తప్పుల్ని కప్పి పుచ్చుకునే పనిలో పడింది కాంగ్రెస్. లలిత్‌తో తనకెలాంటి పరిచయం లేదని ప్రియాంక బుకాయించింది. ఈ ట్వీట్‌తో బీజేపీపై కాంగ్రెస్ విమర్శల దాడికి తెరపడింది.

* ప్రస్తుత రాష్ట్రపతి, యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీని కూడా లలిత్ మోడీ వదల్లేదు. 2011లో కేంద్రమంత్రి శశిథరూర్ పదవి పోవడానికి కారణమయ్యానన్న కక్షతో తనను ప్రణబ్ వేటాడారని మోడీ మరో ట్వీట్ చేశాడు. ఐతే సూటిగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.

* ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా మోడీ పంచ్ పడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి జైట్లీ విధేయుడని ఆరోపిస్తూ వారితో కలిసి జైట్లీ ఉన్న ఫొటోల్ని షేర్ చేశాడు. ఐపీఎల్ వ్యవహారాల్లో తాను నిందితుడినైతే.. తనతో కలిసి పని చేసిన జైట్లీ కూడా నిందితుడే అని మరో ట్వీట్ చేశాడు మోడీ.

* గాంధీల వారసుల్లో ఒకడైన భాజపా ఎంపీ వరుణ్ గాంధీకి కూడా మోడీ దెబ్బ తగిలింది. వరుణ్‌పై మోడీ తీవ్ర ఆరోపణలే చేశాడు. వరుణ్ కొన్నేళ్ల కిందట లండన్లో తన ఇంటికి వచ్చి.. ఐపీఎల్‌ కుంభకోణానికి సంబంధించి తన పెద్దమ్మ సోనియాతో కలిసి సెటి్ చేస్తానని.. ఇందుకోసం 6 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని చెప్పాడని మోడీ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.

కొసమెరుపు: మోడీ తన ట్వీట్లతో ఇరు పక్షాల నాయకుల్ని బాగానే ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ అతడి విషయంలో త్వరలోనే అధికార, ప్రతిపక్షాలు ఏకమైనా కావచ్చు. అతను అందరికీ తలనొప్పిగా మారాడని.. అతడి ఆట కట్టించాలని రెండు పక్షాలూ ఏకమైతే మోడీ పనైపోతుంది. అతడిని చట్టప్రకారం ఇండియాకు రప్పించి.. కేసుల్ని మూవ్ చేయడం ద్వారా జైలు శిక్ష పడేలా చేయొచ్చు. లేదంటే మోడీని అంతమొందించే ప్రయత్నాలు కూడా జరగొచ్చు. ఐతే ప్రస్తుతానికైతే మోడీ దగ్గర మన నాయకుల గురించిన రహస్యాలు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ట్వీట్ యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.