Begin typing your search above and press return to search.

మాయావ‌తికి లాలూ షాకింగ్ ఆఫ‌ర్‌!

By:  Tupaki Desk   |   19 July 2017 1:25 PM GMT
మాయావ‌తికి లాలూ షాకింగ్ ఆఫ‌ర్‌!
X
రాబోయే ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి ఏర్పాటు దిశ‌గా ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగానే బీఎస్సీ అధినేత్రి మాయావ‌తికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మాయావ‌తి అంగీక‌రిస్తే ఆమెకు బిహార్ నుంచి రాజ్య‌స‌భ సీటు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని లాలూ ట్వ‌ట్ట‌ర్ లో వెల్ల‌డించారు. తాను మాయావతితో చాలా సేపు మాట్లాడానని, ద‌ళితుల‌పై వేధింపులు, బీజేపీ విభజన అజెండాకు వ్యతిరేకంగా పోరాడేందుకు బిహార్‌ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని ఆమెతో చెప్పానని లాలూ ట్వీట్ చేశారు.

త‌న ఆఫ‌ర్ ను మాయావ‌తి అంగీక‌రిస్తే ఆమెను బిహార్‌ నుంచి రాజ్యసభకు పంపుతామని లాలూ చెప్పారు. తాము మాయావ‌తి వెంట ఉంటామ‌ని, ఆమెకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని భరోసా ఇచ్చారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతిల మ‌ధ్య మైత్రికి లాలూ చొర‌వ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లాలూ వారిద్ద‌రినీ ఒకే వేదిక‌పై క‌లిపేందుకు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 27న పట్నాలో నిర్వహించనున్న ర్యాలీకి మాయావ‌తి, అఖిలేశ్ ను లాలూ ఆహ్వానించారు.

బిహార్ లో ఆర్జేడీ, జేడీయూ ల మ‌ధ్య విభేదాలు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. లాలూ కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని జేడీయూ కోరిన సంగ‌తి విదిత‌మే. ఈ వ్య‌వ‌హారంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు - లాలూ కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. గ‌తంలో మోదీకి దూరంగా ఉన్న నితీశ్ ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్డీఏ ప్ర‌భుత్వానికి నితీశ్ కుమార్ ద‌గ్గ‌ర‌వుతున్న నేప‌థ్యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా లాలూ మ‌హా కూట‌మి ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, దళితులపై దాడుల అంశంపై రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వ‌నంద‌కు నిర‌స‌న‌గా మాయావ‌తి త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె త‌న రాజీనామాను రాజ్య‌స‌భ చైర్మ‌న్ హ‌మీద్ అన్సారీకి స‌మ‌ర్పించారు. అయితే, మాయావ‌తి రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. మ‌రోవైపు, ఎంపీగా మాయావ‌తి పదవీకాలం 2019 ఏప్రిల్‌ లో ముగియనుంది. ఈ ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీఎస్పీకి 18 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి కేవలం 18 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో, మ‌రోసారి ఆమెను రాజ్యసభకు పంపే బలం బీఎస్పీకి లేదు. ఈ నేప‌థ్యంలో మాయావ‌తిని మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపేందుకు లాలూ సిద్ధ‌ప‌డ‌డం ఆమెకు ఊహించ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.