Begin typing your search above and press return to search.

లాలూ ప్రసాద్ కు 5 ఏళ్ళ జైలు శిక్ష

By:  Tupaki Desk   |   21 Feb 2022 9:55 AM GMT
లాలూ ప్రసాద్ కు 5 ఏళ్ళ జైలు శిక్ష
X
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఒకపుడు దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో పాతిక సంవత్సరాల తర్వాత సీబీఐ కోర్టు వరుసగా శిక్షలు విధిస్తోంది. సుమారు రు. 139 కోట్ల కుంభకోణంలో లాలూయే ప్రధాన దోషిగా అప్పుడెప్పుడో ఛార్జిషీటు వేశారు. ఆ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగి జరిగి ఈ మధ్యనే లాలూను దోషిగా తేల్చింది.

మొత్తం ఐదు కేసులను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు కేసుల్లోనూ లాలూను దోషిగానే తేల్చటం గమనార్హం. తాజాగా పడిన శిక్ష ఐదవ కేసు. మొదటి కేసులో 5 సంవత్సరాల శిక్షపడింది. రెండో కేసులో మూడున్నరేళ్ల శిక్ష విధించింది. మూడో కేసులో మళ్ళీ 5 ఏళ్ళ శిక్షపడింది. ఇక నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్ల కింద ఏడేళ్ళు శిక్ష పడింది. ఇపుడు అయిదో కేసులో కూడా 5 ఏళ్ళ శిక్షతో పాటు రు. 60 లక్షల జరిమానా విధించింది.

సరే ఎవరు మాత్రం తాము చేసిన నేరాలను, కుంభకోణాలను అంగీకరిస్తారు. చాలామంది లాగే లాలూ మద్దతుదారులు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను అంగీకరించటం లేదు. సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష, జరిమానాను తాము హైకోర్టులో చాలెంజ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే లాలూ కొడుకు, ఆర్జేడీ చీఫ్, బీహార్ ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాత్రం ఏమీ మాట్లాడకపోవటం.

ఎప్పుడైతే సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా పేర్కొంది వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. వెంటనే తన భార్య రబ్రీ దేవిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పటివరకు కేవలం ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితమైన భార్యను ఏకంగా ముఖ్యమంత్రిని చేయటం ఒక్క లాలూకు మాత్రమే చెల్లింది. రబ్రీదేవి కూడా భర్త, కుటుంబ సభ్యుల డైరెక్షన్లో హ్యాపీగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. కొంతకాలంగా లాలూ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. బెయిల్ కు అప్లై చేసుకున్నా చాలాసార్లు రెజెక్టయ్యింది. మరి అన్ని కేసుల్లోను శిక్షలు పడటంతో ఏమి చేస్తారో చూడాలి.