Begin typing your search above and press return to search.

మోడీ దేవుడ్ని మోసం చేశాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:05 AM GMT
మోడీ దేవుడ్ని మోసం చేశాడా?
X
దేవుడు ఇస్తాడో లేడో కానీ.. ప్రధాని మోడీ మాత్రం బీహార్ మీద కురిపిస్తున్న వరాల జల్లుకు బీహారీ లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. వరాల విషయంలో.. వ్యాపార వ్యవహారాల్లో సగటు గుజరాతీలా వ్యవహరించే ప్రధాని మోడీ.. అట్టే వరాలు ఇవ్వటం కనిపించదు. ఆయన నోటి నుంచి వరాలు ఇచ్చారంటూ అందులో ఎంతో కొంత అర్థం.. పరమార్థం ఉండాల్సిందే.

బీహార్ కు ప్రకటించిన రూ.1.25లక్షల కోట్లు కావొచ్చు.. గతంలో ఇచ్చిన రూ.40వేల కోట్ల హామీలు కావొచ్చు.. అన్నింటిని టోకుగా అమలుగా చేస్తామని చెప్పటంతో పాటు.. బీహార్ లోని 21 జిల్లాల్ని వెనుకబడిన జిల్లాలుగా హోదా ఇస్తూ.. ఆయా జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీల.. పన్ను మినహాయింపులతో ఉదరగొట్టేస్తున్న మోడీ దెబ్బకు బీహార్ లోని బీజేపీయేతర పార్టీలకు వణుకు పుట్టిస్తోంది.

ఈ నెలాఖరు నాటికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో మోడీ కురిపిస్తున్న వరాల జల్లుపై మోడీ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ఇచ్చిన వరాల గురించి ఏమీ అనలేని వారు.. వెతికి.. వెతికి మాటలు కూర్చుకొని ఒక వాదనను సిద్ధం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంటే.. ఇప్పుడు కానీ బీహార్ గుర్తుకు రాలేదా? మరి.. ఇంతకాలం ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నలు సంధించి.. ఇదంతా ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే ఇలాంటి వరాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రజల్ని మోసం చేయటానికి ప్యాకేజీ ప్రకటించారని..తన వరాలతో బీహారీలను ఫూల్స్ చేశారని వ్యాఖ్యానించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. మోడీ దేవుడ్ని కూడా మోసం చేశారంటూ ఉక్రోషపు విమర్శలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్.. నితీశ్ లాంటి వారికి బీహార్ ను అభివృద్ధి చేసేందుకు బీహారీలు ఎప్పుడో అవకాశం ఇచ్చారు. ఇంతకాలం చేతులు ముడుచుకొని కూర్చున్న వారికి.. మోడీ లాంటి మేజిక్ మనిషి సీన్ లోకి ఎంటరై.. తన విశ్వరూపాన్ని ప్రదర్శించటం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం మింగుడు పడని విధంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.