Begin typing your search above and press return to search.

హాశ్చర్యం.. ఆ నేతలు మళ్లీ కలిశారు.. లేటు వయసులో..

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 PM GMT
హాశ్చర్యం.. ఆ నేతలు మళ్లీ కలిశారు.. లేటు వయసులో..
X
బిహార్ రాజకీయాల్లో ఆదివారం ఓ ఆశ్చర్యకర పరిణామం. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) శరద్ యాదవ్ మళ్లీ ఒక్కటయ్యారు. ఎల్‌జేడీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు శరద్ యాదవ్ ప్రకటించారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కచోటకు చేరినట్లయింది. బిహార్ లో శరద్ యాదవ్, లాలూ, రాం విలాస్ పాసవాన్, ప్రస్తుత సీఎం నీతీశ్ కుమార్ అటుఇటుగా అంతా ఒకే వయసువారు. కేంద్ర మంత్రిగా ఉన్న పాసవాన్ గతేడాది చనిపోయారు.

ఆయన పార్టీ ఎల్జేపీ (లోక్ జనశక్తి) రెండు ముక్కలైంది. అది వేరే విషయం. ఇక లాలూ దాణా కుంభకోణంలో జైలు శిక్షకు గురయ్యారు. కాగా, జనతాదళ్ సీఎంగా ఉన్న సమయంలో లాలూ ఈ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా ఆర్జేడీని స్థాపించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తనవెంట నడవడంతో సీఎం అయ్యారు.

అవినీతి కేసులో జైలుకెళ్లినా.. తన భార్యను సీఎం చేశారు. అయితే, 2005 తర్వాత బిహార్ లో లాలూ హవాతో పాటు ఆర్జేడీ ప్రభావం తగ్గిపోయింది. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ వచ్చాక కొంత పుంజుకొంది. ఇక శరద్ యాదవ్ ది భిన్నమైన పరిస్థితి. నీతీశ్ కుమార్ తో కలిసి జనతాదళ్ (యు) ను స్థాపించిన ఆయన కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి దూరమయ్యారు.

లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ)ను నెలకొల్పారు. చివరకు ఆదివారంనాడు ఆర్జేడీలో విలీనం చేశారు. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు చెప్పారు. బీజేపీని ఓడిపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ప్రస్తుతం, యూనిఫికేషన్ అనేదే తమ ప్రాధాన్యతా క్రమమని, ఐక్య విపక్షానికి ఎవరు సారథ్యం వహించాలనేది తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

లాలూతోనే చెడి.. లాలూ చెంతకే శరద్ యాదవ్, లాలూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఒకే సారి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. కానీ, లాలూ జనతాదళ్ ను విభేదించి వెళ్లినా శరద్ మాత్రం జేడీయూలోనే ఉన్నారు. తర్వాతి పరిణామాల్లో జేడీయూతోనూ విభేదించి సొంత కుంపటి పెట్టారు.

వాస్తవానికి జనతా దళ్ లోనూ లాలూ, శరద్ కు అంత సఖ్యత ఉండేది కాదనేవారు. అయితే, విభేదించి కాలం 25 ఏళ్లు ముందుకెళ్లిన తర్వాత ఇప్పుడు లేటు వయసులో మళ్లీ ఒక్కటయి ఆశ్చర్యపరిచారు. శరద్ యాదవ్ కు ఇప్పుడు 74 ఏళ్లు. లాలూకు 73. మరి ఈ లేటు వయసులో వారి రాజకీయ కలయిన ఎలా సాగుతుందో చూడాలి..?