Begin typing your search above and press return to search.

మోడీని ఏ చౌరస్తాలో శిక్షించాలి!

By:  Tupaki Desk   |   27 Dec 2016 4:50 AM GMT
మోడీని ఏ చౌరస్తాలో శిక్షించాలి!
X
నవంబరు 8న మోడీ ప్రకటించిన నిర్ణయం అనంతరం ఎవరి స్థాయిలో, ఎవరి ఆలోచనల మేర వారు స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సంగతులు అలా ఉంటే... నవంబరు 8 నుంచి లెక్కవేసుకుంటే నాటి నుంచి మరో 50 రోజుల్లో సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని ప్రకటించారు. 2017 జనవరి 1తర్వాత ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు ఉండవని, నల్ల కుబేరులంతా పట్టుబడతారని ప్రకటించారు! అయితే మరో మూడు రోజుల్లో ఆ ఏభై రోజుల ముచ్చట పూర్తవనున్నప్పటికీ ఏటీఎంలలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో కూడా రావాల్సిన మొత్తంలో నగదు రావడంలేదు. దీంతో సమాన్యుడి కష్టాలు మరికొంతకాలం ఇలానే ఉంటాయని అర్ధం అవుతుంది. ఇదే క్రమంలో డిపాజిట్లపై ఆంక్షలు అనే విషయం మరింతకాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్రం నుంచి సన్నాయి నొక్కులతో కూడిన సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీపై తీవ్రంగా స్పందించారు లాలూ ప్రసాద్ యాదవ్.

నల్లకుబేరులను శిక్షించడం అనేసంగతి దేవుడెరుగు కానీ... నల్లధనాన్ని వెలికి తీసేందుకే నోట్ల రద్దు అని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 50 రోజుల్లో తొలగిపోతాయంటూ మోడీ ఇచ్చిన గడువు పూర్తవబోతుంది. ఈ క్రమంలో ఇక ఆయన్ను ప్రజలు శిక్షించే సమయం దగ్గరపడింది.. మోడీని ఏ చౌరస్తాలో శిక్షించాలో ఆయనే నిర్ణయించుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. ఏ బహిరంగ సభలకు వెళ్లినా అక్కడ ప్రజలు "మోడీ.. మోడీ.." అంటూ నినాదాలు చేస్తూ, ప్రశంసిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ భ్రమపడుతున్నారని చెప్పిన లాలూ... అలా నినదించేవారంతా ఆయన సభల్లో ముందు సీట్లలో కూర్చున్న ఆరెస్సెస్‌ వాళ్లే నని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని, వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందని లాలూ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/