Begin typing your search above and press return to search.

పులుసులో ములక్కాయ కాస్త పోటుగాడయ్యాడే

By:  Tupaki Desk   |   9 Nov 2015 4:06 AM GMT
పులుసులో ములక్కాయ కాస్త పోటుగాడయ్యాడే
X
‘‘సమోసాలో ఆలూ (బంగాళదుంప) ఎంత కాలం ఉంటుందో.. బీహార్ లో లాలూ (లాలూ ప్రసాద్ యాదవ్) అంతకాలం ఉంటాడు’’ అంటూ తన గురించి తాను చెప్పుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు మరోసారి బీహార్ హీరోగా అవతరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక మహా కూటమి ‘మహా విజయం’లో లాలూదే సింహ భాగం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో విజయం క్రెడిట్ మొత్తం నితీశ్ ఖాతాలో వేసేస్తున్నారు. కానీ.. పార్టీల వారీగా సీట్ల లెక్కలోకి చూస్తే.. నితీశ్ ప్రాతినిధ్యం వహించే జేడీయూకి వచ్చిన సీట్ల కంటే.. లాలూ పార్టీ అయిన ఆర్జేడీ 9 స్థానాలు ఎక్కువ గెలుచుకోవటం గమనార్హం.

నితీశ్ జేడీయూ 71 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే.. లాలూ ఆర్జేడీ ఏకంగా 80 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో 101 స్థానాల్లో విజయం సాధించారు. అందరూ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి నితీశ్ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదని చెబుతుంటారు. మరి.. అదే నిజమైతే.. నితీశ్ పార్టీ పోటీ చేసిన 101 స్థానాలకు 71 స్థానాలకే పరిమితం కావటం ఏమిటి? ఎన్నికల ముందు.. ఎన్నికల సమయంలోనూ పులుసులో ములక్కాయ లాంటి లాలూ పార్టీ ఏకంగా 80 స్థానాల్లో విజయం సాధించటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం లోతుగా చూస్తే.. ఒక్క విషయం అర్థమవుతుంది. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న లాలూ ప్రాభవం బీహార్ లో తగ్గలేదని.. ఆయన పని అయిపోయిందని.. షెడ్డుకు వెళ్లటమే ఆలస్యమన్న లాంటి మాటల్లో పస లేదని బీహార్ తాజా ఫలితాలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. కులాల సంకుల సమరమైన బీహార్ లో మెజార్టీగా ఉండే యాదవుల విశ్వాసాన్ని లాలూ మాత్రమే పొందటం ఇన్ని సీట్లు గెలవటానికి కారణంగా చెప్పొచ్చు. లాలూను దెబ్బ తీయటానికి ఆయన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో యాదవ కులానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపితే.. బీజేపీ సైతం యాదవ కులానికి చెందిన అభ్యర్థినే దింపింది. అయితే.. బీజేపీ బరిలోకి దింపిన యాదవ అభ్యర్థిని ఓడించిన బీహారీ ఓటరు.. లాలూ పార్టీకి పట్టం కట్టారు. దీంతో.. బీహారీ యాదవులకు లాలూ తిరులేని నేత అన్న విషయం తాజా ఎన్నికలు స్పష్టం చేశాయి.

బీహార్ లో పట్టు ఉన్న లాలూకు.. మహా కూటమిలో చేరటం లాభించింది. తనకు సంప్రదాయ బద్ధంగా ఉన్న ఓటు బ్యాంకుకు.. జేడీయూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడు కావటంతో.. లాలూ తిరుగులేని హీరో అయ్యారు. దీంతో పాటు.. తనకు సహజసిద్ధంగా ఉండే కొన్ని లోపాల విషయంలో రాజీ పడి.. ‘మిత్రధర్మాన్ని’ పాటించటంలో ఎలాంటి తప్పులు చేయకపోవటం మరింతగా కలిసి వచ్చింది. కూటమిలో అనవసర జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించారు. కేవలం.. తాము పోటీ చేస్తున్న ప్రాంతాల పైనే దృష్టి సారించారు.

బీహార్ రాజకీయాల్లో దశాబ్దానికి పైనే చక్రం తిప్పిన లాలూ.. గత కొన్నేళ్లుగా తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాలన్న విషయాన్ని గుర్తించిన లాలూ.. ఒకప్పుడు తనకుబద్ధ శత్రువైన నితీశ్ కు స్నేహ హస్తాన్ని చాచేందుకు మొహమాట పడలేదు. అదే ఇప్పుడు లాలూను ‘‘గ్రేట్ కమ్ బ్యాక్’’ గా మార్చింది. తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు. గతంలో ఆయన చెప్పినట్లు సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్ లో లాలూ ఉంటాడన్నట్లుగా.. కనుచూపు మేర వరకూ మాత్రం బీహార్ రాజకీయాలు లాలూతో ముడిపడి ఉంటాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నికల ముందు పులుసులో ములక్కాయ.. ఆటలో అరటిపండుగా అనిపించిన లాలూ.. తాజా ఫలితాలతో మాత్రం పోటుగాడిగా అవతరించారని చెప్పక తప్పదు.