Begin typing your search above and press return to search.

లాలూ మాటే నిజ‌మైంది.. రైల్లో అనారోగ్యం!

By:  Tupaki Desk   |   1 May 2018 5:59 AM GMT
లాలూ మాటే నిజ‌మైంది.. రైల్లో అనారోగ్యం!
X
ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆర్జేడీ అధినేత‌.. మాజీ కేంద్ర‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ కు ఈ మ‌ధ్య‌న దెబ్బ మీద దెబ్బ త‌గులుతున్న ప‌రిస్థితి. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయ‌న ఈ మ‌ధ్య తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌టం తెలిసిందే. దీంతో.. ఆయ‌నకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు.

తాజాగా ఆయ‌న్ను సోమ‌వారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే.. త‌న‌కు అనారోగ్యం పూర్తిగా న‌యం కాలేద‌ని.. త‌న‌ను చంపాల‌న్న కుట్ర‌తోనే త‌న‌ను త్వ‌ర‌గా డిశ్చార్జి చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. అయితే.. లాలూ మాట‌ల్లో నిజం లేద‌ని.. ఆయ‌న‌కు ఆరోగ్యం బాగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు.

లాలూ డిశ్చార్జి నిర్ణ‌యాన్ని తాము తీసుకోలేద‌న్న ఎయిమ్స్ వైద్యులు.. మెడిక‌ల్ బోర్డు స‌ల‌హాతోనే ఆయ‌న్ను డిశ్చార్జ్ చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన లాలూ.. రాంచీ వెళ్లేందుకు రైల్లో ప్ర‌యాణం పెట్టుకున్నారు. అయితే.. మార్గ‌మ‌ధ్యంలోనే ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో.. యూపీలోని కాన్పూర్ రైల్వేస్టేష‌న్లో ఇద్ద‌రు వైద్యులు లాలూకు వైద్యప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

లాలూకు ర‌క్త‌పోటు.. షుగ‌ర్ పెరిగిన‌ట్లుగా తేల్చారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న‌కు మందులు ఇచ్చారు. అదే ట్రైన్లో త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు లాలూ. త‌న‌కు స‌రిగా న‌యం కాక ముందే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల్లో నిజం ఉంద‌న్న‌ట్లుగా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌న్న మాట వినిపిస్తోంది.