Begin typing your search above and press return to search.

లాలూ ఈజ్ బ్యాక్.. స్ట్రాంగ్ కౌంటర్ తో

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 PM GMT
లాలూ ఈజ్ బ్యాక్.. స్ట్రాంగ్ కౌంటర్ తో
X
దేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ది చెరగని ముద్ర. ఇప్పుడంటే దాణా కుంభకోణం కేసులో అరెస్టయి జైలు శిక్షకు గురై, అనారోగ్యం, వయోభారంతో వెనుకబడి ఉండవచ్చు గానీ.. పది పదిహేనేళ్ల కిందటి వరకు లాలూ హవా అంతా ఇంతా కాదు. బిహార్ సీఎంగా, రైల్వే మంత్రిగా లాలూ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ఓ దశలో పాకిస్థాన్ లోనూ లాలూ హల్ చల్ కొనసాగిందంటే మాటలు కాదు. అలాంటి లాలూ దాణా కుంభకోనంలో జైలు పాలై తెరమరుగయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆయన అతి కష్టమ్మీద బయటకు రాగలిగారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. అదేమంటే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వాణీ చేపట్టిన, అసలు ఆ పార్టీని పైకి లేపిన రథయాత్రను బిహార్ లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న లాలూను.. అదే బీజేపీ అదే స్థాయిలో రాజకీయాల నుంచి తెరమరుగు చేసింది.

నేనుండగా.. ఆర్జేజీ పగ్గాలు తేజస్వీకా..? బిహార్ ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా, జైలుకెళ్లినా ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) జాతీయాధ్యక్షుడిగా లాలూనే ఉన్నారు. అయితే, ఆయన అనారోగ్యం రీత్యా పగ్గాలను చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ కు అప్పజెప్పనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికితోడు తేజస్వీ బిహార్ రాజకీయాల్లో ఆరితేరారు. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో పార్టీని గెలిపించినంత పనిచేశారు. త్రుటిలో విజయం చేజారినా తేజస్వీ బలమైన నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో లాలూ ఆర్జేడీ పగ్గాలను తేజస్వీకి అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిని శనివారం లాలూ తీవ్రంగా ఖండించారు. ''అలా అనుకునే (ఆర్జేడీ అధ్యక్షుడిగా తేజస్వీ) వాళ్లంతా తెలివిలేని వారంటూ (ఫూల్స్‌)'' మండిపడ్డారు. పార్టీలో ఏం జరిగినా అది మేమే చెబుతామన్నారు. వాస్తవానికి లాలూ 74 ఏళ్ల వయసుకు వచ్చారు. ఇదివరకటిలా చురుగ్గా లేరు. పైగా అనారోగ్యం. లాలూ కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటుండడంతో గత 2 ఎన్నికలను తేజస్వీనే నడిపించారు. ఒకవిధంగా చెప్పాలంటే లాలూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ, పార్టీ పగ్గాలు మాత్రం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం జరిగే పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో తేజస్వీ యాదవ్‌కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై లాలూను మీడియా ప్రశ్నించగా.. ''ఆ వార్తలు పుట్టిస్తున్నవారంతా ఫూల్స్‌. పార్టీలో ఏం జరిగినా అది మేం చెబుతాం'' అని వ్యాఖ్యానించారు.

రబ్రీ, తేజ్ ప్రతాప్ కూడా స్పందించారు.. పార్టీ అధ్యక్ష పదవి వ్యాఖ్యలపై లాలూ భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవీ, వారి పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కూడా స్పందించారు. ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10న పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి రబ్రీ దేవీ, తేజస్వీతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. అయితే లాలూ ఈ సమావేశంలో పాల్గొనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.25 ఏళ్లుగా లాలూనే ప్రెసిడెంట్జనతాదళ్ తో విభేదించి. .ఆ పార్టీని నిలువునా చీల్చి.. 1997లో ఆర్జేడీని స్థాపించారు లాలూ. అప్పటినుంచి ఆయనే చీఫ్. మధ్యలో జైలుకెళ్లినా సీఎం పదవిని మాత్రమే భార్య రబ్రీకి అప్పగించారు. పార్టీ పదవిని వదల్లేదు. అయితే, దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు ఈ నెలలో తీర్పు వెలువరించనుంది. అందులోనూ లాలూ ప్రసాద్‌కు శిక్షపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీ పగ్గాలను ఇద్దరు కుమారుల్లో ఒకరికి అప్పచెబుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్‌కే పార్టీ బాధ్యతలు అందజేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. వీటికి తాజాగా లాలూ గట్టిగా చెక్ పెట్టారు.