Begin typing your search above and press return to search.

లాలూకు అర్థమైంది చిన్నమ్మకు అర్థమై ఉంటే..?

By:  Tupaki Desk   |   13 Feb 2017 3:02 PM GMT
లాలూకు అర్థమైంది చిన్నమ్మకు అర్థమై ఉంటే..?
X
అధికారానికి కేంద్రబిందువుగా ఉన్నా.. అధికారం చేతిలో ఉండే ఆ హఢావుడే వేరు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చాలామంది నేతలకు ఈ విషయాలు తెలియనివి కావు. కాకుంటే కొంతమంది తెలివైన అధినేతలు.. తమది కాని కాలంలో కామ్ గా ఉండటం.. తమదైన టైంలో చెలరేగిపోతుంటారు. చిన్నమ్మ శశికళ లాంటోళ్లు.. సమయం.. సందర్భం చూసుకోకుండా చెలరేగి లేనిపోని తిప్పలు నెత్తి మీదకు తెచ్చుకుంటారు.

సీఎం కానప్పటికీ యాక్టింగ్ సీఎంగా ఎంత హవా నడిపించాలో అంత హవా నడిపించే అవకాశం ఉన్నా.. సీఎం కుర్చీలో కూర్చుంటే కానీ.. తృప్తిగా ఉండదన్నట్లుగా వ్యవహరించిన శశికళకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. తమిళనాడుకు దూరంగా ఉన్న బీహార్ లో చోటు చేసుకున్న ఒక ఘటన చూస్తే.. టైం కాని టైంలో.. అవమానకరమైన వ్యవహారాన్ని ఎంత హుందాగా లాలూప్రసాద్ యాదవ్ డీల్ చేసిన పద్ధతిని చూసి తీరాల్సిందే.

ఆర్జేడీ చీఫ్ గా ఉన్న లాలూ.. బీహార్ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భాగస్వామ్యం అన్న సంగతి తెలిసిందే. ఇక.. ఆ రాష్ట్రముఖ్యమంత్రి నితీశ్ సైతం.. లాలూను పెద్దన్నయ్యగానే అభివర్ణిస్తుంటారు. అలాంటి లాలూకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన లాలూ.. వేదిక మీదకు వచ్చి.. ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నారు. అధికారులు ఆయన వద్దకు వచ్చి.. ఆ సీటు సీఎం కోసం కేటాయించిందన్న మాటను చెప్పారు. మరో మాట మాట్లాడకుండానే సీటులో నుంచి లేచిన ఆయన పక్కకు వెళ్లి కూర్చున్నారు.

కాసేపటికి అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి వేదిక మీదకు వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఈ ఎపిసోడ్ చెప్పేదేమంటే.. సీఎం సీట్లో కూర్చున్న నితీశ్ కు పవర్ ఇచ్చేది తానే అయినప్పటికీ.. తాను ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని మర్చిపోకుండా ఉండటమే కాదు.. ఏస్థానానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ స్థానానికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని లాలూ చెప్పకనే చెప్పారని చెప్పాలి. లాలూకు అర్థమైన విషయం చిన్నమ్మకు అర్థమై ఉంటే.. తమిళనాడులో ఈ రోజు ఇంత రచ్చ చోటు చేసుకునేది కాదేమో.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/