Begin typing your search above and press return to search.

వార్నింగ్ లతో లాలూ కొడుకు వీరంగం

By:  Tupaki Desk   |   6 July 2016 10:40 AM GMT
వార్నింగ్ లతో లాలూ కొడుకు వీరంగం
X
రాజకీయాల గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా ఆర్జేడీ అధినేత.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా.. విలేకరులు ఆయనపై ఎన్ని ప్రశ్నలు సంధించినా కంట్రోల్ మాత్రం తప్పరు. నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నా.. తన రాజకీయ చాతుర్యంతో బీహార్ రాజకీయాల్ని కంట్రోల్ చేస్తున్న ఆయన.. ఆ మధ్య జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో దేశం మొత్తానికి తెలిసేలా చేశారు.

ఈ ఎన్నికల సందర్భంగా తన రాజకీయ వారసులుగా తన ఇద్దరు కొడుకుల్ని రంగంలోకి దింపారు. వీరిలో చిన్న కొడుకైన తేజస్వీ యాదవ్ బీహార్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా జాగ్రత్తగా ఉంటూ వివాదాలకు దూరంగా ఉంటుంటే.. పెద్దోడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యవహరిస్తున్న అతగాడి తీరుపై తరచూ విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్జేడీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని కవర్ చేయటానికి మీడియాను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా బృందంలో ఒక కెమేరా మెన్ తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసుకోవటంపై తేజ్ ప్రతాప్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తీసిన ఫోటోల్ని డిలీట్ చేయాలని పట్టుబట్టారు. దీనికి సదరు కెమేరా మెన్ ససేమిరా అనటంతో.. ఈ వ్యవహారం ముదిరింది. కెమేరా మెన్ కు అండగా జర్నలిస్ట్ లు అంతా నిలవటం.. వివాదం తీవ్రతరం అవుతున్న సంగతి తెలుసుకున్న లాలూ.. ఈ ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నంచేశారు. తొలుత ఆ ఫోటోల్ని డిలీట్ చేయాలని కోరినా.. నో చెప్పిన నేపథ్యంలో మౌనంగా ఉండిపోయిన ఆయన.. కాసేపటి తర్వాత వేదిక మీదకు సదరు ఫోటోగ్రాఫర్ ను పిలిచి.. తన కొడుకుతో షేక్ హ్యండ్ ఇప్పించి.. వివాదాన్ని క్లోజ్ చేశారు. వివాదాలకు దూరంగా ఉండే అంశానికి సంబంధించి కొడుకులకు లాలూ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందేమో..?