Begin typing your search above and press return to search.

రాహుల్‌ ను లాలూ వేదిక మీదికి రానిస్తాడా?

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:05 AM GMT
రాహుల్‌ ను లాలూ వేదిక మీదికి రానిస్తాడా?
X
కొందరు సీరియస్‌ నాయకులు ఉంటారు.. తమకు ఎన్నడో జరిగిన అవమానాన్ని కొన్ని దశాబ్దాలు అయినా సరే.. వీసమెత్తు మరిచిపోకుండా గుర్తుంచుకుని.. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా...? అని ఎదురుచూస్తూనే గడుపుతుంటారు. అలాంటి కరడుగట్టిన వ్యక్తిత్వం లాలూప్రసాద్‌ యాదవ్‌కు లేదనడానికి వీల్లేదు. బీహార్‌ రాజకీయాలను ఒంటిచేత్తో శాసించగల చేవ - తెగువ - నేర్పరితనం తనలో ఇంకా తగ్గలేదని ఈ ఎన్నికలతో లాలూ మళ్లీ నిరూపించుకున్నారు. అలాంటి లాలూకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా, ఆమెపుత్రరత్నం లాలూ మీద ఒక స్థాయిలో ఆగ్రహం ఉంది. అలక ఉంది. ఇప్పుడు బీహార్ లో మళ్లీ తన జమానా మొదలవుతున్నది గనుక.. ఈ సందర్భంలో దానిని ప్రదర్శిస్తారా.. వారు గతంలో తనకు చేసిన అవమానానికి ప్రతీకారంగా.. ఆయన రాహుల్‌ ను మళ్లీ అవమానించి పగ సాధిస్తారా? లేదా? అనేది ఒకటిరెండురోజుల్లో తేలిపోతుంది.

వివరాల్లోకి వెళితే.. అవినీతికి పాల్పడిన నేరాల్లో శిక్షపడి.. లాలూప్రసాద్‌ యాదవ్‌.. గతంలో జైలు పాలైన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అప్పట్లో ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో ఒక రాజకీయ వేదిక మీద కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే.. లాలూప్రసాద్‌ తో కలిసి వేదికను పంచుకోవడం ఇష్టంలేదని సోనియా వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. ఆయన ఆ సంగతి మరచిపోలేదు. బీహార్‌ ఎన్నికల్లో ఏదో భాజపా హవా ఉంటుందేమో.. దాన్ని సమర్థంగా ఎదుర్కొనడానికి అందరూ కలిస్తే మంచిది అనే భయంతో కాంగ్రెస్‌ ను కూడా మహా కూటమిలో కలుపుకున్నారే గానీ.. ఆ పార్టీతో లాలూ సఖ్యంగా ఉన్నారనడానికి వీల్లేదు.

ఎందుకంటే.. బీహార్‌ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ తో కలిసి పాల్గొనేది లేదని, తాను ఉండే సభల్లో రాహుల్‌ రావడానికి వీల్లేదని లాలూ ఆంక్షలు పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ రకంగా రాహుల్‌ ను వెలివేసి లాలూ కక్ష సాధించారు. తీరా ఇప్పుడు ఆ కూటమిని విజయం వరించింది. నితీశ్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రాహుల్‌ కూడా ముచ్చటపడుతున్నాడు. అయితే ఈ వేదిక మీదికి రాహుల్‌ ను లాలూ రానిస్తాడా.. లేదా, గతంలో తనకు చేసిన అవమానాన్ని గుర్తుచేసేలా సెటైర్లు వేస్తాడా? అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతోంది.

అయినా రాజకీయాల్లో అవకాశవాదమే శాశ్వతం తప్ప.. శాశ్వతమిత్రులు - శాశ్వత శత్రువులు ఉండరంటే అతిశయోక్తి ఏముంది?