Begin typing your search above and press return to search.

మోడీ నాటకమా? మోడీకి పితలాటకమా?

By:  Tupaki Desk   |   8 March 2018 12:30 PM GMT
మోడీ నాటకమా? మోడీకి పితలాటకమా?
X
ప్రత్యేక హోదా అనేది మోడీ సర్కారు మీద రాష్ట్ర ప్రభుత్వాలు అలక పూనడానికి ఒక సులువైన మార్గంలాగా మారిపోతున్నాదని అనిపిస్తోంది. తాజాగా తెలుగుదేశం కేంద్రంనుంచి తప్పుకున్న నేపథ్యంలో భాజపాకు మరో మిత్రపక్షంగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం తమకు కూడా ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ కొత్త పాట అందుకున్నది. బీహార్ కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలంటూ నితీశ్ డిమాండ్ ప్రారంభించారు.

నితీశ్ హోదా గురించి అడగడం అనేది ఇవాళ కొత్త కాదు. గతంలో కూడా పలుమార్లు ఆయన ఇదే డిమాండ్ వినిపించారు. అయితే తాజాగా కేంద్ర రాష్ట్రాల సంబంధాల మీదనే అనేక ప్రతిష్టంభన ఏర్పడుతున్న సమయంలో.. నితీశ్ ఈ మాట చెప్పడం వెనుక ఏదైనా పరమార్థం ఉన్నదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది నితీశ్ వెనుక ఉండి మోడీ ఆడిస్తున్న నాటకమా? లేదా, మోడీ హవాకు మరో దెబ్బగా మారడానికి నితీశ్ సృష్టిస్తున్న పితలాటకమా? అనే విశ్లేషణలు సాగుతున్నాయి.

నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీకి పాత శత్రువు కొత్త మిత్రుడు. మోడీ ప్రధాని అయ్యేట్లయితే.. తాను కూటమిలో ఉండబోనంటూ.. ఆయన గతంలోనే ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. లాలూతో జట్టుకట్టారు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మోడీ ప్రాపకంలోకి వచ్చి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి నితీశ్ ఇప్పుడు మోడీ చెప్పినట్టు ఆడే చాన్సు ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. మోడీ వ్యతిరేకతతో వ్యవహరిస్తే.. రాష్ట్రంలోని భాజపా మద్దతు ఉపసంహరిస్తే గనుక.. ఆయన ప్రభుత్వం కూలిపోతుంది.

అలాంటి నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే కేంద్రానికి ఇంకా చాలా రాష్ట్రాలనుంచి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని సంకేతాలు ఇవ్వడానికి నితీశ్ వెనుకనుంచి మోడీ కోటరీనే ఈ డిమాండును నడిపిస్తుండవచ్చుననే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

అదే నిజమైతే ఇవన్నీ చిల్లర రాజకీయాలు అని.. వీటివల్ల.. రాజకీయంగా అవతలిపక్షాన్ని కట్టడి చేయడం కుదురుతుందే తప్ప.. ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదని పలువురు అనుకుంటున్నారు.