Begin typing your search above and press return to search.

ట్రంప్ నకు హీరోయిన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   20 March 2020 2:30 AM GMT
ట్రంప్ నకు హీరోయిన్ వార్నింగ్
X
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 అలియాస్ కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ చైనాపై తనకున్న అక్కసును ట్రంప్ వెళ్లగక్కారు. అంతేకాదు - ఇలా అనడం కరెక్ట్ కాదని చెప్పినా వినని ట్రంప్....తన వ్యాఖ్యలను మీడియా సాక్షిగా సమర్థించుకున్నారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై నటి లానా కాండోర్ మండిపడింది. దేశాల మధ్య చిచ్చుపెట్టే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను చేసిన ట్రంప్ ఒక నాయకుడే కాదంటూ ట్వీట్ చేసింది. మరోవైపు, ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. కోవిడ్-19ను చైనీస్ వైరస్ అని పిలవొద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఒక దేశాధ్యక్షుడి హోదాలో ఉన్నపుడు ఆచి తూచి మాట్లాడాలని కాండోర్ మండిపడింది. అమెరికన్-ఏసియన్లపై ట్రంప్ వ్యాఖ్యలు ఎంతో ప్రభావం చూపుతాయని, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని నాయకుడనరని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చైనా ప్రజలు అభద్రతా భావంలో ఉంటారని, చైనా ప్రజలపై దాడి జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్ సిగ్గుపడాలని చెప్పింది. నాయకుడని పిలుపించుకునే అర్హత ట్రంప్ నకు లేదని - నిజమైన నాయకులు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా లా ఉంటారని గడ్డిపెట్టింది. లక్షల కొద్దీ మాస్క్ లను జాక్ మా అమెరికన్లకు ఇచ్చి తన వంతు సాయం చేశాడని...ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఆపాలని ట్రంప్ నకు హితవు పలికింది.

కాగా, వైర‌స్‌ల‌కు జాతి - కులాలు తెలియవని - అదేం చైనీస్ వైరస్ కాదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైక్ ర్యాన్ తెలిపార. మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా మాట్లాడాలని, కరోనా వైరస్ అని మాత్రం పిలవాలని అన్నారు. నార్త్ అమెరికాలో హెచ్‌1ఎన్‌1 వైర‌స్ పుట్టినపుడు...దానిని ఆ ప్రాంతం పేరుతో 'అమెరిక‌న్ ఫ్లూ' అని పిలవ‌లేద‌ని ర్యాన్ అన్నారు. వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాలు కలిసిక‌ట్టుగా పోరాటం చేయాల‌ని ర్యాన్ పిలుపునిచ్చారు.