Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారుకు భూ స‌మ‌స్య‌...

By:  Tupaki Desk   |   7 Sep 2015 9:36 AM GMT
బాబు స‌ర్కారుకు భూ స‌మ‌స్య‌...
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వానికి భూముల స‌మ‌స్య వేటాడుతోంది. అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌న్నింటికీ భూములు అవ‌స‌రం ప‌డ‌టం..ప్ర‌భుత్వ భూముల‌కు తోడు ప్రైవేటు భూములు సేక‌రించాల్సి రావ‌డం...ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక రావ‌డం ప‌రిపాటిగా మారిపోయింది.

విజయనగరం జిల్లాలో ఉన్న రెండు తీర ప్రాంత మండలాల్లో ఒకటి భోగాపురం. 5వ నెంబర్ జాతీయ రహదారికి అనుకుని ఉన్న ప్రాంతం. ఈ మండలంలోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలలుగా సాగుతున్న చర్చకు స్పష్టత ఇస్తూ.. 5312 ఎకరాలను సేకరించేందుకు భూ సేకరణ నోటీసు కూడా ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ముగ్గురు అధికారులను సేకరణకు నియమించింది. అయితే, తమతో చర్చలు లేకుండా ఏకపక్షంగా వెళ్తున్న సర్కారు పంథాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో ఉన్న విమానాశ్రయానికి అదనంగా, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది. ఇందుకోసమే భోగాపురాన్ని ఎంపిక చేసింది. హైవే పక్కనే ఉండడం, విమానాశ్రయం ప్రతిపాదనలతో.. ఇక్కడి భూముల రేట్లు భారీగా పెరిగాయి. ఐదేళ్లలో ఎకరా ధర 50 వేల నుంచి 50 లక్షల వరకు చేరింది. మంచిరేటు రావడంతో కొందరు తమ స్థలాల్లో కొంత భాగాన్ని అమ్మేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం మరికొంత ఉంచుకున్నారు. ఈ సమయంలో భూ సేకరణ నోటిఫికేషన్ వచ్చింది. రిజిష్ట్రేషన్ రేటు ప్రకారం ఇప్పుడు ఎకరాకి పది హేను లక్షల రూపాయలు కూడా దాటని పరిస్థితి. అంతేకాకుండా ఊర్లను కూడా ఖాళీచేయాల్సి రావడాన్ని భోగాపురం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వారంతా భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

అయితే భోగాపురం వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజా ఉద్యమానికి దారి తీస్తోంది. భూ సేకరణకు కోసం ప్రకటన కూడా ఇచ్చిన సర్కారు.. ఎటువంటి ప్రతిఘటనలు తలెత్తకుండా సెక్షన్ 30ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ వ్యవహారం మీద బాధిత గ్రామ జనం భగ్గుమంటున్నారు. కోపంతో రగిలిపోతున్నారు.

వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని చల్లార్చే బాధ్యతను మంత్రి గంటా శ్రీనివాసరావుకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉన్నఫళంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విమానాశ్రయ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాలను దహనం చేశారు. గ్రామాలే కేంద్రంగా ఆందోళనలను చేపట్టాలని నిర్ణయించారు. మ గ్రామాలలోకి అధికారులు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రామస్థులు హెచ్చరించారు. వినూత్న రీతిలో దశలవారీ ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. తాజాగా త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్నారు.

మొత్తంగా ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయో? ప‌్ర‌భుత్వానికి భూ సేక‌ర‌ణ అంశం ఇంత ఇబ్బందిక‌రంగా మార‌టం ఏమిట‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.