Begin typing your search above and press return to search.

హైదరాబాద్ 'రీజినల్' కోసం భూసేకరణ..21 రోజుల గడువు

By:  Tupaki Desk   |   22 April 2022 2:30 PM GMT
హైదరాబాద్ రీజినల్ కోసం భూసేకరణ..21 రోజుల గడువు
X
హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు దానికి చుట్టుపక్కల మరో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి రెండో గెజిట్ విడుదలైంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్ అథారిటీలోని 8మంది అధికారులకు గాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను పేర్కొంటూ 3 (క్యాపిటల్ ఏ)గా పిలిచే ఈ గెజిట్ ను గురువారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

ప్రస్తుతానికి ఈ రీజనల్ రోడ్డు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఆర్డీవో, సంగారెడ్డి జిల్లా ఆంధోల్-జోగిపేట ఆర్డీవోల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, దాని పరిధిలో సేకరించాల్సిన భూముల విస్తీర్ణాన్ని ఇందులో పేర్కొన్నారు.

సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వేనంబర్ల వివరాలను ఈ గెజిట్ లో పొందుపరిచారు. కంపీటెంట్ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి-భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డి పల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్ పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ట భూమిని సమీకరించనున్నట్టు గెజిట్ లో తెలిపారు.

ఈ క్రమంలోనే గెజిట్ ను విడుదల చేశారు. ఈరోజు నుంచి 21 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలపై సమాధానాలు వెలువడ్డ తర్వాత రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సంబంధించి రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం పరికరాల శాటిలైట్ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న దీనికి జాతీయ హోదాను కట్టబెట్టుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు అయ్యే ఖర్చు ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.

ఈరోడ్డు పూర్తయితే హైదరాబాద్ పరిధి చాలా విస్తరిస్తుంది. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు పరిశ్రమలు, అభివృద్ధి విస్తరిస్తుంది.హైదరాబాద్ కు ఆవల మొత్తం 338 కిలోమీటర్ల పొడువు నిర్మాణంతో ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్, యాచారం, షాద్ నగర్, పరిగి , పూడూరు, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల మీదుగా ఈ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వెళుతుంది.

ప్రస్తుతం ఉత్తర దిశలో ఉన్న చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశలకు కలిపి 17వేల కోట్లు హైదరాబాద్ కోసం కేంద్రం ఖర్చు చేయనుంది.. హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను ఇది కలుపుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భూసేకరణ పనులను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఖరీదైన భూములను సేకరించడం అంత ఈజీ కాకపోవడంతో ఈ బాధ్యతను కేసీఆర్ సర్కార్ పై పెట్టారు. దీంతో అసలు భూసేకరణ కష్టమన్న ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70కి.మీల దూరంలో ఓఆర్ఆర్ కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరుగనుంది.సుమారు 20కిపైగా ముఖ్యనగరాలు, పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరుగనున్న ఈ రహదారితో 40శాతం మంది ప్రజలకు రింగురోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.