Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా: అక్క‌డ భూసేక‌ర‌ణ ఆగింది

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:12 AM GMT
గ‌మ‌నించారా: అక్క‌డ భూసేక‌ర‌ణ ఆగింది
X
లాక్కోవ‌ద్దు.. లాక్కోవ‌ద్దు.. లాక్కోవ‌ద్దు.. నేను చెబుతున్నా అంటూ ఆవేశంతో మాట్లాడిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు ప‌ని చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌ధాని కోసం భూసేక‌ర‌ణకు ఏపీ స‌ర్కారు రంగం సిద్ధం చేయ‌టం.. రాజ‌ధాని ప్రాంతంలోని 3,200 ఎక‌రాల‌కు చెందిన రైతులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో భూసేక‌ర‌ణ చేప‌ట్టొద్ద‌ని ట్విట్ట‌ర్ లో కోరిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ఏపీ మంత్రుల వ్యాఖ్య‌ల‌తో రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రైతుల‌కు ఇష్టం లేకుండా భూములు ఎట్టిప‌రిస్థితుల్లో సేక‌రించొద్దంటూ విస్ప‌ష్టంగా పవ‌న్ ప్ర‌క‌టించారు. ఒక‌వేళ భూసేక‌ర‌ణ విష‌యంలో ఏపీ స‌ర్కారు కానీ ముందుకెళితే తాను ధ‌ర్నా చేస్తాన‌ని చెప్పారు. ఇదిలా ఉంటే.. భూసేక‌ర‌ణ విష‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శించిన ఏపీ స‌ర్కారు.. ప‌వ‌న్ హెచ్చ‌రిక త‌ర్వాత ఆ అంశం మీద నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

భూసేక‌ర‌ణ‌ను ఆపేది లేద‌న్న‌ట్లుగా మంత్రులు చెప్పిన‌ప్ప‌టికీ.. వాస్త‌వ ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భూసేక‌ర‌ణ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ కొన్ని ప్రాంతాల్లో ఏపీ స‌ర్కారు ఇప్ప‌టికే జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ద‌శ‌ల వారీగా చేప‌డ‌తామ‌ని చెప్ప‌టం జ‌రిగింది. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత నోటిఫికేష‌న్ ఇచ్చిన ప్రాంతంలోనూ భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ జ‌ర‌గ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. భూమిని సేక‌రించే విష‌యంలో సంయ‌మ‌నం వ‌హించాల‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి మున్సిప‌ల్ అధికారుల‌కు చెప్పిన మీద‌ట ఈ ప్ర‌క్రియ‌ను ఆపిన‌ట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. కొత్త నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేయ‌టం లేదు. భూసేక‌ర‌ణ చేప‌ట్ట‌టం ద్వారా ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురి కావ‌టంతో పాటు.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం ఉంది. అందుకే.. ఆచితూచి అడుగులు వేయాల‌న్న ఆలోచ‌న‌తో భూసేక‌ర‌ణ అంశానికి తాత్క‌లికంగా బ్రేక్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ప‌వ‌న్ మాట‌లు ప‌ని చేసిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. మ‌రి.. ఇది ఎంత‌కాలం ఉంటుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.