Begin typing your search above and press return to search.

ఆ ప్రఖ్యాత జైల్లో వైసీపీ పార్టీ ఆఫీసుకు భూమి కేటాయింపు ప్రతిపాదన?

By:  Tupaki Desk   |   19 May 2022 2:43 AM GMT
ఆ ప్రఖ్యాత జైల్లో వైసీపీ పార్టీ ఆఫీసుకు భూమి కేటాయింపు ప్రతిపాదన?
X
వెనుకా ముందు చూసుకోకుండా.. విమర్శలకు వెరవకుండా.. ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఆలోచన చేయకుండా.. తన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోయే ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపోయేలా ఉంది. ఇప్పటికే వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కరిబిక్కిరి అవుతూనే.. మళ్లీ అదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని కోరటం విశేషం. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం జగన్ సర్కారు తాజాగా స్థలాన్ని కేటాయించాలని కోరుతూ చేసిన ప్రతిపాదన బయటకు వచ్చింది.

అధికారంలో ఉన్న పార్టీ.. తమ ఆఫీసుల కోసం ప్రభుత్వ భూముల్ని కేటాయించుకోవటం తెలిసిందే. తాజాగా రాజమహేంద్రవరం జైలు భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలన్న ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా చేసిన ఈ ప్రతిపాదనపై విస్మయం వ్యక్తమవుతోంది.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ జైలుకు సంబంధించిన భూమిని ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలకు కేటాయింపులు చేశారు. ఈ తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా పార్టీ ఆఫీసు కోసం ప్రతిపాదనను ఇవ్వటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జైలు స్థలం మొత్తం 170 ఎకరాలు కాగా.. ఇప్పటికే పలు ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థలు భూకేటాయింపులు జరిపాయి.

జగన్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం జైలుకు చెందిన భూమిని వైద్య కళాశాల కోసం 13 ఎకరాలు తీసుకోగా.. తాజాగా వైసీపీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీసు కోసం రెండు ఎకరాల్ని కేటాయించాలని కోరుతూ రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ ద్వారా పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రతిపాదనలు పెట్టారు. ఈ అంశం తాజాగా వెలుగు చూసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో వైద్య కళాశాల కోసం తీసుకున్న స్థలంలో డీఐజీ ఆఫీసు.. గెస్టు హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ జిల్లా ఆఫీసు కోసం భూమిని కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనను దాఖలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయినా.. మరెక్కడా స్థలం దొరకనట్లు.. జైలు భూమిని అడగటమేంది జగన్ సారూ?