Begin typing your search above and press return to search.

సీఎం కూతురు అడిగితే చౌకగా భూమి ఇచ్చారు?

By:  Tupaki Desk   |   3 March 2016 7:34 AM GMT
సీఎం కూతురు అడిగితే చౌకగా భూమి ఇచ్చారు?
X
తమ రాజకీయ జీవితం.. సామాన్యులకే అంకితం అని చెప్పుకునే నేతలు.. వాస్తవంలో ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించే ప్రేమతో పేరుప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న నేతలు ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ చేరనున్నారు. దీర్ఘకాలం గుజరాత్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్రమోడీ.. తనపై ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే.. ఆయన వారసురాలిగా ముఖ్యమంత్రి గద్దె మీదకు ఎక్కిన ఆనందిబెన్ పటేల్ మాత్రం కూతురు మీద అవసరానికి మించిన ప్రేమను ప్రదర్శించి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు.

ఆనందిబెన్ కుమార్తె అనార్ పటేల్ పార్టనర్ గా ఉన్న ఒక కంపెనీకి గుజరాత్ ప్రభుత్వం కారుచౌకగా భూముల్ని కట్టబెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒక ఎకరమో.. రెండు ఎకరాలో కాకుండా ఏకంగా 422 ఎకరాల భూమిని ఇచ్చేయటం వివాదానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఏకంగా 91.6 శాతం డిస్కౌంట్ ఇచ్చేసి మరీ కట్టబెట్టేశారు. 2010లో జరిగిన ఈ భూ బదలాయింపు వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.

422 ఎకరాల భూమిని చదరపు మీటరు కేవలం రూ.15 చొప్పున చెల్లించి సొంతం చేసుకునేలా నిర్ణయం తీసుకోవటం ఒక విశేషమైతే.. ఆ భూమికి దగ్గర్లోనే ఉన్న భూమిని గోవు సంరక్షణ సంస్థ ఒకటి కావాలని కోరితే చదరపు మీటరుకు రూ.671 చొప్పున ముక్కుపిండి వసూలు చేయటం గమనార్హం. గోవుల సంరక్షణకు బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే బీజేపీ నేతలు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ భూదందాకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.