Begin typing your search above and press return to search.

చంద్రబాబులో ఇంకా అదే ధైర్యం ఉందా?

By:  Tupaki Desk   |   22 July 2017 4:24 AM GMT
చంద్రబాబులో ఇంకా అదే ధైర్యం ఉందా?
X
పార్టీలోని ఎవ్వరు ఎలాంటి అవినీతికి పాల్పడినా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం చంద్రబాబునాయుడు పదేపదే చెబుతూ ఉంటారు! ఈ విషయమై నిజమే అని ఆధారాలు సృష్టించుకోదలచుకున్నట్లుగా ఇటీవల కొన్ని సందర్భాల్లో పార్టీకి చెందిన కొందరి మీద ఆరోపణలు రాగానే వారిని పార్టీనుంచి సస్పెండ్ చేసేసి, వేటు వేయడం ద్వారా కఠినంగా వ్యవహరించారు. అయితే చంద్రబాబునాయుడులో ఇప్పటికీ అదే ధైర్యం ఉందా.. అవినీతి అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న అందరు నాయకుల పట్ల ఒకే రీతిగా వ్యవహరించగల తెగువ ఉందా? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూకబ్జా కేసుల్లో ఇరుక్కున్నారు. విశాఖపట్నంలో మితిమీరి జరిగిన భూఅక్రమాలను సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల్ని అనుసరించి, వారి సూచనల మేరకు దాదాపు 96 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో మరో పదిమంది సహా, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై కూడా కేసు నమోదు అయింది. ఎమ్మార్వో నే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు పెట్టారు. రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూముల్ని కాజేశారనేది ఆరోపణ. ఎమ్మెల్యే సమీప బంధువులపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఇప్పుడు జనంలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. తన అవినీతి వ్యతిరేక దృఢవైఖరిని చాటుకోవడానికి ఎమ్మెల్యేను కూడా చంద్రబాబు పార్టీలోంచి సస్పెండ్ చేస్తారా? లేదా, ఇక్కడ ఏదైనా డొంకతిరుగుడు మాయ మాటలు చెబుతారా? అని! హైదరాబాదులో భూఅక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నేత దీపక్ రెడ్డి ఇరుక్కోగానే చంద్రబాబు ఆయనను సస్పెండ్ చేశారు. ఇదే తరహాలో మరికొన్ని సస్పెన్షన్లు కూడా జరిగాయి. మరి ఇదే వైఖరిని ఈ బీసీ ఎమ్మెల్యే పీలా పట్ల కూడా చూపిస్తారా లేదా, అవినీతి పరులందు మంచి అవినీతి పరులు వేరయా.. అంటూ, కొత్త వ్యాఖ్యానాలతో కాపాడుకుంటారా? అనేది వేచిచూడాలి.

అయితే పీలా పై చర్య తీసుకునే వ్యవహారం అంత ఈజీ కాదని, విశాఖ భూముల కుంభకోణంలో పార్టీలోని అనేక పెద్ద తలకాయలు కూడా ఉండడంతో.. ఎమ్మెల్యే మీద చర్య తీసుకుంటే.. ఒక్కొక్కటిగా అందరి బాగోతాలూ బయటకు వస్తాయని.. ఆ స్థాయిలో పార్టీ పరువు పోవడానికి చంద్రబాబు సాహసించకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.