Begin typing your search above and press return to search.

నిండా ఆరోపణల్లో కూరుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   22 July 2017 5:50 AM GMT
నిండా ఆరోపణల్లో కూరుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే
X
విశాఖ భూకుంభకోణాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణమూర్తిపై భూ ఆరోపణలు, వివాదాలు ముసురుకుంటున్నాయి. గతంలో ఏ ఎమ్మెల్యేపైనా లేని విధంగా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. అనేక ప్రభుత్వ భూములు వ్యవహారంలో పీలా లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా రెండు చోట్ల పోలీసు కేసులు ఎమ్మెల్యేపై నమోదయ్యాయి.

అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో 39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవంగా ఇందులో 11 మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించి వారికి నష్టపరిహారాన్ని అందజేసింది. అయితే ఎమ్మెల్యే పీలా అండతో రెవెన్యూ అధికారులు సుమారు 39 మంది నిర్వాసితులను కొత్తగా సృష్టించి వారికి ఆరుకోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌ సృజనకు నివేదించారు. ఆఖరి నిమిషంలో జెసి ఈ వ్యవహారాన్ని గుర్తించి బ్రేకులు వేశారు. అయితే తహసిల్దార్ ఎమ్మెల్యే అండతోనే ఈ విధంగా ఆరుకోట్లు నష్టపరిహారానికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కశింకోట మండలం జమాదులపాలెంలో ఒక మైనారిటీ వ్యక్తి పేరిట సుమారు 210 ఎకరాల భూమిని రికార్డుల్లో చేర్చారు. అయితే ఈ భూముల్లో దశాబ్ధాలుగా 267 మంది రైతులు సాగులో ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే పీలా సూచనల మేరకే గతంలో ఆర్డీవోగా విదులు నిర్వహించిన పద్మావతి - అక్కడ ఉన్నతాధికారులు కలిసి ఒక వ్యక్తి పేరిట వెబ్‌ల్యాండ్‌లో 210 ఎకరాలు నమోదు చేయడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది.

ఆనందపురం మండలం రామవరంలో సర్వేనెంబర్లు 126 -127 - 130/1 - 130/2లో సుమారు 95.89 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో అధిక శాతం భూమిని పీలా కుటుంబ సభ్యుల పేరిట దక్కించుకోవడం జరిగింది. తాజాగా ఈ విషయమై ఆర్డీవో కోర్టులో కేసు కూడా నమోదైంది. ఈ నేపధ్యంలోనే రికార్డులు తారుమారు చేసి ఈ భూములు దక్కించుకున్నట్లు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో పాటు మరో పది మందిపైనా గురువారం ఆనందపురం పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదైంది.

ఇక సబ్బవరం మండలంలో 80 ఎకరాల భూదాన్ భూముల విషయంలోనూ వివాదముంది. ఆనందపురం మండలంలోనూ ఆరోపణలు ఉణ్నాయి. అక్కడ సుమారు 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఇక్కడ పీలా కుటుంబం దక్కించుకొని అందులో జీడిమామిడి ఫలసాయం తోటలు అనుభవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో పీలాపై భూ ఆక్రమణల ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది సమయంలో సిట్‌ కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌ లో తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పుడు పీలా చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి.

ఇది చాలదన్నట్లు పెందుర్తిలో ఉన్న తమ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఫైనాన్సియర్‌ రమణతో పాటు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రయత్నించారని తమపై దౌర్జన్యానికి కూడా దిగారని ఇద్దరు మహిళలు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలన్నిటినీ పీలా ఖండిస్తున్నా ప్రతిపక్ష నేతలు మాత్రం ఆయనపై బలమైన ఆరోపణలు చేస్తున్నారు.