Begin typing your search above and press return to search.

అమరావతిలో భూముల గోల

By:  Tupaki Desk   |   24 Sep 2015 5:43 AM GMT
అమరావతిలో భూముల గోల
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో గజం భూమి కూడా ఇప్పుడు బంగారమే. అందుకే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అన్న తేడా కూడా లేకుండా అక్కడ గత ఆరు నెలలుగా వివాదాలు నడిచాయి. కానీ, ఇప్పుడు అక్కడ మరో వివాదం నడుస్తోంది. అదే.. భూములు ఇచ్చిన రైతులకు, ప్రభుత్వానికి మధ్య.

తమ డాక్యుమెంట్లలో ఉన్న భూముల కంటే సీఆర్ఢీఏ అధికారులు నమోదు చేసిన వివరాల్లో తమ పొలం తక్కువగా ఉందని, దానివల్ల తమకు నష్టం వస్తోందనే ఫిర్యాదులు ఇప్పుడు అమరావతిలో తీవ్రమయ్యాయి. కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు ఇప్పుడు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. తమ పొలాన్ని మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డాక్యుమెంట్లలో ఉన్న విధంగా తమకు భూములు కేటాయించకపోతే, తమ భూములను తిరిగి తమకు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రాజధానికి తాము భూములు ఇచ్చేది లేదని భీష్మిస్తున్నారు. దాంతో వారి సమస్యలు పరిష్కరించడం సీఆర్డీఏ అధికారులకు తలనొప్పిగా మారింది.

సమస్య పరిష్కారానికి పాత దస్తావేజులను తీసుకు రావాలని అధికారులు డిమాండ్లు చేస్తున్నారు. అయితే, తాతలనాటి ఆస్తులు కావడంతో వాటికి దస్తావేజులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాము సర్వే పక్కాగానే చేశామని, అందులో ఎటువంటి తేడా లేదని, తమ సర్వే ప్రకారమే పరిహారం చెల్లిస్తామని వివరిస్తున్నారు. పంట భూములను వాటి యజమానులు తరతరాలుగా సబ్ డివిజన్ చేయించుకోకపోవడమే ఇప్పుడు సమస్యకు కారణమని వివరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకపోయినా.. ఇప్పుడు భూములు కోట్లు పలుకుతుండడంతో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం భూ సమీకరణపైనే ప్రభావం చూపుతోంది. కొంతమంది రైతులు భూ సమీకరణను వ్యతిరేకించే దిశగా ముందుకు కదులుతున్నారు.