Begin typing your search above and press return to search.

తెలంగాణ స‌చివాల‌యంలోనే సెటిల్ మెంట్‌!

By:  Tupaki Desk   |   7 July 2018 6:00 AM GMT
తెలంగాణ స‌చివాల‌యంలోనే సెటిల్ మెంట్‌!
X
తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో చోటు చేసుకున్న ఒక వివాదం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రాష్ట్ర ప‌రిపాల‌నా కేంద్ర‌మైన స‌చివాల‌యంలో ఒక మంత్రికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు.. త‌న అనున‌చ‌రుల మ‌ధ్య త‌లెత్తిన భూవివాదం కాస్తా ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స‌చివాల‌యంలో మంత్రిగారి పేషీలో సింఫుల్ గా సెటిల్ చేసుకుందామ‌నుకున్న వ్య‌వ‌హారం కాస్తా చిలికిచిలికి గాలివాన‌లా మారి.. ఎక్క‌డికో వెళ్ల‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో సెటిల్ మెంట్ పంచాయితీ మొద‌లైనా.. కాసేప‌టికే ఇష్యూ సీరియ‌స్ గా మారి.. హాట్ హాట్ గా వాతావ‌ర‌ణంలో ముగియ‌టం స‌చివాల‌య వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌క్షిణ తెలంగాణ‌కు చెందిన రాష్ట్ర మంత్రి ఒక‌రు కీల‌క‌మైన శాఖ‌ను చూస్తున్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాలోని ఒక అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే క‌మ్ వ్యాపార‌వేత్త అయిన నేత ఒక‌రు హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో భూమి కొనుగోలు చేశారు. అయితే.. ఆ భూమిని కొంద‌రు క‌బ్జా చేశారు. అయితే.. భూమిని ఆక్ర‌మించినోళ్లు మంత్రిగారికి సంబంధించిన వారు కావ‌టంతో ఇష్యూ ఆయ‌న వ‌ద్ద‌కు చేరుకుంది. కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోలు చేసిన ఎమ్మెల్యే.. త‌న భూమినే క‌బ్జా చేయ‌టాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. ఇరువురి మ‌ద్య రాయ‌బారం చేసి సెటిల్ చేద్దామ‌న్న ఉద్దేశంతో మంత్రి ఛాంబ‌ర్లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

భారీ మొత్తాన్ని చెల్లించి భూమిని కొనుగోలు చేస్తే.. ఎలా క‌బ్జా చేస్తార‌ని ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మాషాలు చేస్తున్నారా? అంటూ సీరియస్ అయ్యారు. త‌న ముందే త‌నవాళ్ల‌పై ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో స‌ద‌రు మంత్రి అవాక్కు అయ్యారు. ఎందుకంత గ‌ట్టిగా మాట్లాడ‌తారంటూ ఎమ్మెల్యేపై మంత్రి మండిప‌డ్డారు. దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న వాతావ‌ర‌ణానికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. మంత్రి.. ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఒక‌రిపై మ‌రొక‌రు మాటా మాటా అనుకున్నారు.

దీంతో.. ఓపిక న‌శించిన ఎమ్మెల్యే మ‌రింత ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసి.. అయ్యేది.. పోయేది ఏముంది? అవ‌స‌ర‌మైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వెళ్లి తేల్చుకుంటాన‌ని కోపంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దాదాపు ప‌ది రోజుల క్రితం జ‌రిగిన ఈ ఉదంతం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు పొక్కింది. స‌చివాల‌యంలో మంత్రి ఛాంబ‌ర్లోనే క‌బ్జా పంచాయితీ చేయ‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు అధికార పార్టీలో హాట్ చ‌ర్చ‌కు తెర తీసింది.