Begin typing your search above and press return to search.

దీదీని చంపేయాలనుకుంటున్నారట

By:  Tupaki Desk   |   1 Dec 2016 12:33 PM IST
దీదీని చంపేయాలనుకుంటున్నారట
X
పశ్చిమ బెంగాల్ అధికారపక్ష నేతల ఆరోపణలు చాలా చిత్రంగా ఉంటాయి. అధికారుల తప్పులు.. ఉదాసీనతకు కొత్త అర్థాలు వెతికి.. భారీ ఆరోపణలు చేయటం వారికి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి. విమానాయాన అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టాల్సింది పోయి.. తమ అధినేత్రిని చంపటానికి కుట్ర పన్నుతున్నారంటూ భారీ విమర్శ చేయటం కలకలంగా మారింది. తమ అధినేత్రిని చంపాలని ప్లాన్ చేస్తున్నారంటూ చేస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి.

ఎందుకిలా అన్నది చూస్తే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్ కతా ఎయిర్ పోర్ట్ లోల్యాండ్ కావాల్సింది ఉంది. అయితే.. షెడ్యూల్ ప్రకారం విమానం వచ్చేసినప్పటికీ.. ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ అనుమతి ఇవ్వకపోవటంతో ఆకాశంలోనే చక్కర్లు కొడుతూనే ఉంది. చివరకు ఆ విమానాన్ని ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఇదంతా కూడా తమ అధినేత్రి మమతను హతమార్చేందుకు జరిగిన కుట్రగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హమీక్ మాట్లాడుతూ.. తాము ఐదు నిమిషాల వ్యవధిలోనే కోల్ కతా చేరుకుంటామని పైలెట్లు 180 కిలోమీటర్ల ముందే చెప్పినప్పటికీ ఏటీసీ అధికారులు స్పందించలేదన్నారు. విమానంలో ఇంధనం నిండుకుంటుందని చెప్పినా..పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మమతా..కోల్ కతాకు తిరిగి వెళ్లేక్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నోట్ల రద్దు విషయంపై మమతా బెనర్జీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆమెను చంపాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. సంబంధం లేని అంశాల్నిముడి పెడుతూ.. తీవ్రమైన ఆరోపణలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/