Begin typing your search above and press return to search.

పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు...?

By:  Tupaki Desk   |   1 April 2022 12:30 PM GMT
పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు...?
X
ఒకటి రెండు రోజుల్లో ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ నోటిఫికేషన్ వచ్చిన కొద్ది గంటలలోనే ఏపీలో 26 జిల్లాలలో భారీ ఎత్తున అధికారుల బదిలీలు ఉంటాయని అంటున్నారు.

ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను కేటాయించాలి. అదే విధంగా ప్రస్తుతం ఉన్న జిల్లాలలో ఎవరిని కొనసాగిస్తారు అన్నది కూడా చూడాలి. ఇక సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కొత్త జిల్లాలకు వెళ్లేలా చూస్తున్నారు.

వారి అనుభవం, పాలనాపరంగా ఉన్న పట్టు కొత్త జిల్లాలకు ఎంతైన ఉపయోగపడుతుంది అంటున్నారు. అదే టైం లో కొత్త జిల్లాలకు బాలారిష్టాలు చాలా ఉంటాయి. వాటిని సర్దుబాటు చేసి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యత అంతా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీదనే ఉంటుంది. అందుకే సీనియర్ అధికారుల మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టింది అంటున్నారు.

ఇక ఉగాది, ఆ మరుసటి రోజు కూడా జిల్లాల కలెక్టర్లు అంతా అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. ఈ నెల 4న కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రారంభిస్తారు. దాంతో కలెక్టర్లు అంతా పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

మరో వైపు చూస్తే ఇప్పటికి చాలా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖలకు భవనాలు దొరకడంలేదని అంటున్నారు. దాంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా చూసుకోవాలి. మొత్తానికి వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడ్డాక ఫస్ట్ టైం భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.

దీంతో ఎవరెక్కడ ఉండాలి, ఏంటి అన్న దాని మీద యుద్ధ ప్రాతిపదికన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఏ క్షణమైనా బదిలీ ప్రకటన వెలువడుతుంది అని చెబుతున్నారు.