Begin typing your search above and press return to search.

ఈ రోజు జులై 31..ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   31 July 2022 5:13 AM GMT
ఈ రోజు జులై 31..ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?
X
ఆదాయ పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయ పన్ను నివేదికను ఐటీ శాఖకు దాఖలు చేసే ఆఖరు తేదీ ఈ రోజుతో (జులై 31)తో ముగుస్తుంది. ఉద్యోగులు.. వ్యాపారస్తులతో సహా కోట్లాది మంది ఐటీ రిటర్న్ ను ఆన్ లైన్ లో దాఖలు చేయాల్సి ఉండేది. కొన్నేళ్ల క్రితం ఆదాయపన్ను ఆఫీసులకు వెళ్లి ఇచ్చి రావాల్సి ఉండేది. అలాంటి వేళలో.. టెంట్లు వేసి మరీ.. ప్రత్యేక కౌంటర్లను భారీగా ఏర్పాటు చేసేవారు.ఎప్పుడైతే ఆన్ లైన్ లో ఫైల్ చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందో.. ఐటీ రిటర్న్ ఫైల్ చేయటం సులువుగా మారింది. అయితే.. ఇప్పుడు అది కూడా పలువురికి కష్టంగా.. క్లిష్టంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు ఐటీ రిటర్న్ ను దాఖలు చేసేందుకు గడువును పెంచుకుంటూ పోవటం ఈ మధ్యన రివాజుగా మారింది. సాధారణంగా గడువు తేదీ ముగిసే వేళ.. మరో డెడ్ లైన్ ను ప్రకటించి.. ఐటీ రిటర్న్ కాస్తంత ఆలస్యంగా వేయటానికి ఒక అవకాశం ఉండేది. అయితే.. ఈసారికి మాత్రం అలాంటివేమీ లేవని ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. ఆదాయ పన్ను రిటర్న్ ను దాఖలు చేయటానికి ఈ రోజే ఆఖరి రోజు కానుంది.

గడువు మరికొద్ది గంటల్లో ముగియనుందన.. రిటర్న్ దాఖలు చేయటాన్ని మర్చిపోతే.. అర్జెంట్ గా పూర్తి చేయాలని చెబుతున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. అంటే మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయపన్ను అసెస్ మెంట్ పత్రాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే.. అందుకు చెల్లించాల్సిన భారం ఎక్కువగానే ఉందని చెప్పాలి.

గడువు లోపు ఐటీఆర్ దాఖలు చేయకుంటే.. రెండు రకాల ఫైన్లు చెల్లించి.. ఐటీఆర్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న వారు సకాలంలో ఫైల్ చేయనిదానికి రూ.వెయ్యి వరకు జరిమానాను విధిస్తారు. అదే సమయంలో రూ.5 లక్షలకు పైనే ఆదాయం ఉంటే మాత్రం రూ.5 వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫైలింగ్ పోర్టల్ తో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని.. వాటిని చక్కదిద్దాలని కోరుతున్నారు.

ఈ నెల 28 నాటికి 4.09 కోట్ల మంది తమ ఐటీ రిటర్న్ ను దాఖలు చేసినట్లుగా ఐటీ శాఖ వెల్లడించింది. ఒక్క జులై 28నే ఏకంగా 36 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయటం గమనార్హం. ఎప్పటిలానే గడువు ముగిసే మరికొద్ది గంటల ముందు.. ఐటీఆర్ ను దాఖలు చేసే సమయాన్ని మరింత పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఈసారికి లేనట్లేనని చెబుతున్నారు. సో.. ఐటీ రిటర్న్ ను ఇంకా దాఖలు చేయకుంటే.. కాస్త వీలు చేసుకొని ఈ రోజే పూర్తి చేయండి. లేకుంటే జరిమానాను కట్టాల్సి ఉంటుందన్న విషయాన్నిమర్చిపోకూడదు. ఈ రోజే చివరి రోజు కావటంతో పోర్టల్ బిజీగా మారటంతో పాటు.. హ్యాంగ్ అయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది. కాస్త త్వరపడితే మంచిది.