Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ ఆఖ‌రి చిత్రం ఇదే!

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:48 AM GMT
వాజ్ పేయ్ ఆఖ‌రి చిత్రం ఇదే!
X
ఎవ‌రేం చెప్పినా.. ఎలా అభివ‌ర్ణించినా ఒక‌టి నిజం భార‌త‌దేశ రాజ‌కీయాల్లో వాజ్ పేయ్ లాంటి ట‌వ‌రింగ్ ప‌ర్స‌నాల్టీ వ‌చ్చే ఛాన్స్ లేదు. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. రాజ‌కీయాల్లో విలువ‌లు అంత‌కంత‌కూ ప‌డిపోతున్న వేళ‌.. శిఖ‌ర స‌మానుడైన వాజ్ పేయ్ ఒక అంద‌మైన గురుతుగా.. ఆద‌ర్శ‌ప్రాయుడిగానే నిలుస్తార‌ని చెప్పాలి.

జాతి.. మ‌త.. కుల‌లాల‌కు అతీతం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ఆయ‌న కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకున్నారు. అంట‌రాని పార్టీగా ఉన్న బీజేపీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దానికి కార‌ణం వాజ్ పేయ్ అన్న‌ది బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఆయన‌.. నిన్న తిరిగిరాని లోకాల‌కు ప‌య‌న‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వాజ్ పేయ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు.

అల్జీమ‌ర్స్ తో ఎవ‌రిని గుర్తించ‌లేని ప‌రిస్థితుల్లోకి వెళ్లిన ఆయ‌న‌.. ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌కులు.. అయిన వారి మ‌ధ్య‌నే ఆయ‌న ఉండిపోయారు. ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో బీజేపీ ప్ర‌ముఖులు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌లుక‌రించి వ‌చ్చేవారు. వెళ్లిన వారు ఎవ‌రో.. ఏ స్థాయిలో ఉన్నార‌న్న విష‌యం వాజ్ పేయ్ కు అర్థ‌మ‌య్యేది లేదు. కానీ.. పెద్దాయ‌న మీద త‌మ‌కున్న అభిమానాన్ని ఆయ‌న ఇంటికి వెళ్ల‌టం ద్వారా ప్ర‌ద‌ర్శించేవారు.

వాజ్ పేయ్ ను అభిమానించే వారు.. ఆయ‌న్ను విప‌రీతంగా ఆరాధించే వారెంతో మంది ఉన్నా.. ఆయ‌న్ను చూసేందుకు అనుమ‌తి ఇచ్చే వారు కాదు. బీజేపీలో అత్యంత ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ల‌భించేది. ఏళ్ల‌కు ఏళ్లు ఆయ‌న ఎలా ఉన్నార‌న్న‌ది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలీలేదు. ఒక లెక్క ప్ర‌కారం చూస్తే.. 2009లో ఆయ‌న చివ‌ర‌గా 2009లో క‌నిపించారు. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు.

ఇదిలా ఉంటే మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక 2015లో ఆయ‌న‌కు దేశ అత్యున్న‌త పుర‌స్కారమైన భార‌త‌ర‌త్న‌ను ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో ఉన్న ఆయ‌న‌.. ఆ పుర‌స్కారాన్ని అందుకునే ప‌రిస్థితుల్లో లేక‌పోవ‌టంతో స్వ‌యాన రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వాజ్ పేయ్ ఇంటికి వెళ్లి పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా వాజ్ పేయ్ ఫోటో అధికారికంగా విడుద‌లైంది. అదీ.. పుర‌స్కారాన్ని అందిస్తున్నప్పుడు ట్రే అడ్డుగా ఆయ‌న ముఖం కొంత భాగాన్ని క‌నిపించేలా ఫోటో తీశారు. ఆయ‌న్ను పూర్తిగా చూపించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే అలా ఫోటో తీసి విడుద‌ల చేశార‌ని చెబుతారు. ఒక‌విధంగా చూస్తే.. ప్ర‌పంచానికి వాజ్ పేయ్ చివ‌రి చిత్రం అదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.