Begin typing your search above and press return to search.

నేతాజీ నోట వచ్చిన చివరి మాట ఇదేనంట

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:43 AM GMT
నేతాజీ నోట వచ్చిన చివరి మాట ఇదేనంట
X
దేశ స్వాతంత్ర్య సమరంలో ఎంతోమంది నాయకులు పోరాడినా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇమేజ్ కాస్త వేరుగా ఉంటుంది. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు భిన్న మార్గంలో నడిచిన ఆయన.. అందుకు విదేశీ సాయాన్ని కోరటం.. బ్రిటీషర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావటం తెలిసిందే. అలాంటి వ్యక్తి అనూహ్యంగా విమాన ప్రమాదంలో మరణించినట్లుగా చెబుతారు. ఆయన మరణంపై పలు కథనాలు వినిపిస్తాయి. ఆయన మరణించారని ఎంత బలంగా చెబుతారో..? అంతే బలంగా ఆయన విమానప్రమాదంలో మరణించలేదని.. ఆ తర్వాత ఆయన జీవించి ఉంటారని చెబుతుంటారు. నేతాజీ మరణం ఒక మిస్టరీగా మారిన భావన దేశ ప్రజలో భారీగా వ్యక్తమవుతోంటోంది. దీనికి తగ్గట్లే వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా.

ఇదిలా ఉంటే.. నేతాజీకి సంబంధించి రహస్య పత్రాల్ని విడుదల చేయటంలో భారతదేశ సర్కారు సుముఖంగా ఉండకపోవటం.. ఆ రహస్య పత్రాల్ని కానీ బయటకు వెల్లడిస్తే.. అంతర్జాతీయంగా కొన్నిదేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయన్న మాటను చెబుతుంటారు. ఇటీవల కాలంలో నేతాజీ మరణంపై పరిశోధనలు.. పాత పత్రాల్ని పరిశీలించే కార్యక్రమం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నేతాజీ తాను మరణించే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన చివరి మాటలేంటన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

తన అనుచరుడితో అన్నట్లుగా చెబుతున్న మాటలు చూస్తే.. ‘‘భారత్ కు వెళ్లినప్పుడు దేశం కోసం చివరి వరకూ పోరాడానని చెప్పు. భారత్ కు స్వాతంత్ర్యం వస్తుంది. ఎవరూ బందీగా ఉంచలేరు’’ అన్న మాటలు వెల్లడయ్యాయి. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారన్న అంశంపై బ్రిటన్ లోని వెబ్ సైట్ ఒకటి వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా పలు దస్త్రాల్లోని అంశాల్ని పేర్కొంది. నేతాజీ ఆఖరి మాటలు మొదలు పలు అంశాల్ని పేర్కొంది. తాజాగా బయటకు వచ్చిన అంశాలు చూస్తే..

= 1945 ఆగస్టు 18న జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులైన జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొ కొనొ.. ఇంజినీరు కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో.. బోస్ అనుచరుడు రెహమాన్.. పలువురు చెప్పిన విషయాలని వెబ్ సైట్ పేర్కొంది.

నేతాజీ గురించి పలువురు ప్రముఖులు.. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..

= ‘‘వియత్నాంలోని టౌరేన్ నుంచి జపాన్ కు చెందిన విమానం నేతాజీతో పాటు 12.. 13 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అప్పుడు వాతావరణం బాగుంది. తైపీకి ఆ రోజు సాయంత్రానికి చేరుకోవాలని భావించారు’’ - ఇండియన్ నేషనల్ ఆర్మీ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్.

= ‘‘ విమానం ఎడమ వైపు ఇంజిన్ సరిగా పని చేయటం లేదని గమనించా. విమానంలోకి వెళ్లి పరీక్షించా. బాగానే పని చేసింది. మరో ఇంజనీరు కూడా పరీక్షించి ఓకే చేశారు’’- జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొ.

= ‘‘విమానం బయలుదేరి కొద్దిదూరం వెళ్లగానే ఎడమవైపు ఇంజిన్ వూడి కిందపడిపోయింది. మంటలు చెలరేగాయి’’ – విమానాశ్రయ నిర్వాహణ ఇంజినీరు కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో

= ‘‘విమానం బయలుదేరిన కాసేపటికే పెద్ద శబ్దం వచ్చింది. నా దగ్గరకు వచ్చిన నేతాజీ వెనక్కి వెళ్లలేం.. ముందుకు వెళదామన్నారు. కానీ.. ముందుకు వెళ్లే వీల్లేని విధంగా సామాగ్రి ఉంది. మంటల్ని నేను.. నేతాజీ ఇద్దరం చూశాం. నేను ఉన్ని వస్త్రాలు ధరిస్తే.. నేతాజీ ఖాదీ దుస్తులు ధరించారు. దాంతో ఆయనకు మంటలు వెంటనే అంటుకున్నాయి. ఆయన చొక్కా.. బెల్టు తీశా. తల మీద గాయం తగిలింది. ముఖం కాలింది. ఆ సమయంలో నీకేం కాలేదుగా? అని ప్రశ్నించిన నేతాజీ.. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని భారత్ కు వెళ్లి అందరికి చెప్పు అని అన్నారు’’ – బోస్ అనుచరుడు హబిబ్ ఉర్ రెహమాన్