Begin typing your search above and press return to search.

లతా మంగేష్కర్ ఇంట్లో స్టే చేసిన తెలుగు జర్నలిస్టు చెప్పిన మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:47 AM GMT
లతా మంగేష్కర్ ఇంట్లో స్టే చేసిన తెలుగు జర్నలిస్టు చెప్పిన మాటలు విన్నారా?
X
అతడో తెలుగు జర్నలిస్టు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఉన్నారు. రిపోర్టింగ్ చేసిన వారికి.. చేస్తున్న వారికి కొదవ లేదు. ప్రొఫెషన్ పుణ్యమా అని కొందరికి పవర్ ఫుల్ స్థానాల్లో ఉన్న పాలకులు.. రాజకీయ నేతలతో పరిచయం కావటమే కాదు.. సన్నిహితం అవుతుంటారు. అలాంటి వేళలో.. మిగిలిన వారు చూడని ఎన్నో అంశాల్ని గుర్తించే వీలు ఉంటుంది. అలాంటి సదవకాశాన్ని సొంతం చేసుకున్నారు తెలుగు సాహిత్య జర్నలిస్టుగా.. రిపోర్టర్ గా.. పీఆర్వోగా కొందరికి మాత్రమే పరిచయం ఉన్న పాత్రికేయుడు మహ్మద్ రఫీ. వార్త దినపత్రికలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన.. ఇప్పుడు కొందరికి..కొన్ని సంస్థలకు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.

అనారోగ్యంతో ఆదివారం మరణించిన ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ కు సంబంధించి తనకున్న అనుబంధం గురించి ఆయన సోషల్ మీడియాలో భారీ పోస్టు పెట్టారు. ఇందులో ఆమెకు సంబంధించిన పలు వ్యక్తిగత అంశాల్ని పేర్కొన్నారు. ఆసక్తికరంగానే కాదు.. లతాజీకి సంబంధించి మీడియాలో ఏ మాత్రం హైలెట్ కాని అంశాలతో పాటు.. ఆమె వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఏం చేస్తారన్న విషయాన్ని తనకు తాను స్వయంగా చూసింది.. అనుభవించిన అంశాల్ని వెల్లడించారు.

36 భాషల్లో 50వేలకు పైనే పాడిన లతా రికార్డును చేరుకోవటం మరెవరికీ సాధ్యం కాదని చెప్పక తప్పదు. కరోనాతో అనారోగ్యానికి గురైన లతా మంగేష్కర్ కు మహమ్మారి నుంచి కోలుకునే వేళలో లివర్.. కిడ్నీ సమస్యలు తలెత్తటం.. చివరికి వెంటిలేటర్ మీద ఉన్న ఆమె.. ఆదివారం ఉదయం వేళలో తుదిశ్వాస విడవటం తెలిసిందే. ప్రపంచంలోని పాటల ప్రియులకు అంతులేని విషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె పాడిన పాటలు.. ఆమెతో ఉన్న అనుబంధమే మిగిలింది.

సదరు పాత్రికేయుడు లతాజీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏం చెప్పారన్నది చూస్తే..

- కేంద్రం లో ఏ ప్రభుత్వం వున్నా గౌరవించాయి! దాదా సాహెబ్ పాల్కే మొదలుకుని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న లాంటి అన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు ఇచ్చి ప్రతిభకు పట్టం కట్టాయి! ఆమె మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించి, భారతీయ జెండా ను అవనతం చేయాలనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది! ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం ఆరు గంటలకు అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

- లతా మంగేష్కర్ తో నా అనుబంధం నిజంగా ఒక అదృష్ట భాగ్యం! ఆరు సార్లు ముంబై లోని లత ఇంటికి వెళ్ళాను! వెళ్ళిన ప్రతిసారి నాలుగు గంటలు చొప్పున ఆమె తో ముచ్చటించే భాగ్యం, ఒకరోజు వాళ్లింట్లోనే పడుకున్న అదృష్టం నాకు లభించింది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యం లో ఒకసారి శిల్ప కళావేదిక లో ఘన సత్కారం నిర్వహించినప్పుడు నేను మొదటి సారి 2004 లో లతాజీని వాళ్ళింట్లో కలిశాను! అప్పట్లో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశా. తర్వాత హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయలోనూ ఇంటర్వ్యూ చేశారు.

- 2010లో అప్పటి సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణమూర్తి ఆధ్వర్యం లో లతాజీకి భారీ సన్మానం చేశారు. దానికి సంబంధించిన కార్యక్రమ నిర్వాహణ బాధ్యత అప్పజెప్పారు. రూ.35 లక్షలు రివార్డ్ ఇస్తూ చేసిన సత్కారానికి అమె పులకించిపోయారు. నిజానికి అమె తో మాట్లాడిన అమౌంట్ 25 లక్షలు ఇస్తామని! కానీ, రమణమూర్తి గారు 35 లక్షలు ఇచ్చేశారు! 2009 లో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 50 మంది మీడియా ప్రతినిధులను విమానం లో ముంబై తీసుకెళ్లారు లత.

- ఇక రికార్డింగ్ స్టూడియో లో అన్నమయ్య కీర్తనల సీడీ ఆవిష్కరించడం లో రమణమూర్తి కీలక పాత్ర అయితే, నిర్వహణ బాధ్యత నేను నిర్వహించాను! అప్పట్లో నేను ఒక టీవీ చానల్ లో స్పెషల్ కరెస్పాండెంట్ గా ఉండటం, ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసి ప్రసారం చేయడం మరచిపోలేని అనుభూతి!

- అలాగే లత గారి కుటుంబ సభ్యులు 35 మందితో కలసి ప్రత్యేక విమానం లో ముంబై నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి శ్రీశైలం దేవస్థానం, అక్కడ నుంచి తిరుపతి తీసుకెళ్లడం, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన గాయనిగా బాధ్యతలు స్వీకరించడం, అన్నమయ్య కీర్తనలు ఆలపించడం...వీటన్నింటికి నేను ప్రత్యక్ష సాక్ష్యం!

- లత గారిని కలవడానికి వెళ్లే ప్రతిసారి రమణమూర్తి గారు 12 నల్లి సిల్క్స్ పట్టు చీరలు ఇచ్చి పంపించే వారు! వాటిని చూసి లత పెదవి విరిచే వారు! ‘‘పిచ్చి రమణమూర్తి’’ అని ఫోన్ చేసి తిట్టేవారు! లత రంగు చీరలు కట్టుకోరు! మల్లెపువ్వు లాంటి తెల్ల నేత చీరలు కట్టుకుంటారు!

- ఆమె ఇంట్లో వున్నప్పుడు లంగా ఓణీ లో ఉంటారు! రెండు జడలు వేసుకోవడం ఆమెకు చాలా ఇష్టం! ప్రత్యేకంగా జడ వేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నారు! ఆ అమ్మాయిని చదివించారు! రాత్రిళ్ళు పాటలు వింటూ ఆలస్యం గా పడుకుని, తెల్లారాక మధ్యాహ్నం 12 గంటలకు లేవడం ఆమెకు అలవాటు!

- మోకాళ్ళ నొప్పులు గత రెండు దశాబ్దాలుగా ఆమెను ఇబ్బంది పెట్టాయి! ప్రత్యేకంగా రజని అనే ఫిజియో థెరపిస్ట్ శాశ్వితంగా పెట్టుకున్నారు. ప్రతిరోజూ లతాజీ లేవగానే వివిధ రకాల నూనెలతో ఆమె మర్దన చేసేవారు! రమణమూర్తి గారు చనిపోయిన రోజు ఆమె ప్రత్యేకంగా ఫోన్ చేసి గంటకు పైగా మాట్లాడి ఆ రోజులను, అయన ప్రేమను గుర్తు చేసుకుని ఏడ్చారు!

- లత చిన్నపిల్లలాంటి వారు. సిగ్గు, భయం రెండూ ఎక్కువ! చదువుకోలేక పోవడమే దీనికి కారణం అని చాలా సార్లు చెప్పారు. అందుకే ఎంతో మంది అమ్మాయిలను చెల్లెలు ఉష ఆధ్వర్యం లో చదివిస్తూ విద్యా సేవ చేస్తూ వచ్చారు! లత కు ఇంజక్షన్ అంటే భయం! సర్జరీ లంటే ఇంకా భయం! అయినా వైద్య రంగానికి ఎంతగానో చేయూతనిచ్చారు! చాలా వరకు హోమియో మందులు వాడేవారు! ముంబయిలో దొరకని మందులను చాలాసార్లు నల్లకుంట శంకరమఠం దగ్గర తీసుకుని పంపించేవాడిని! ఇక ముంబయికి వెళ్లి.. ఆమెను కలిసిన ప్రతిసారి నేను ప్రశ్నల్ని సంధిస్తే, ఆమె ఎంతో ఉత్సాహంగా తన అనుభవాలను వివరిస్తుండే వారు ఆసక్తిగా!

- ఎంత చనువు ఉన్నా.. లతాజీ తన ఇంట్లో ఫోటోలు తీయనిచ్చే వారు కాదు! ఎంతో సింపుల్ జీవితం గడిపారు! మామూలుగా వుండే పాత ఫ్లాట్ లో! కుక్కలంటే అంటే చాలా ఇష్టం! మనుషులను నమ్మలేం! కుక్కలు చాలా నయం, బాగా ప్రేమిస్తాయి అనేవారు! మంగేష్కర్ కుటుంబ సభ్యులందరి (ఆశా భోంస్లే మినహాయింపు) బాధ్యత లత దే కావడం విశేషం!

- ఇంట్లో అందరూ ఆమె ను హేమ దీదీ అని పిలుస్తారు! ఆమె అసలు పేరు హేమ! తన 13వ ఏటనే తండ్రి మంగేష్కర్ చనిపోయారు! మంగేష్కర్ స్నేహితుడి సహకారం తో లత గా సినీ సంగీతం లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది! నాలుగు సినిమాల్లో నటించారు. అమె కారణ జన్మురాలు! పాటల కోసమే పుట్టారు! పాటలతో జీవించారు! పాటలే లోకంగా బతికారు!