Begin typing your search above and press return to search.

ఈసారి ఉక్రెయిన్‌ ఆయువుపట్టుపై రష్యా దెబ్బ!

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:54 AM GMT
ఈసారి ఉక్రెయిన్‌ ఆయువుపట్టుపై రష్యా దెబ్బ!
X
ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఇంకా ఆగకపోవడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా రష్యా, ఉక్రెయిన్‌ వెనక్కి తగ్గడం లేదు. ఇంత జరిగాక రష్యాతో చర్చించేదేమీ లేదని ఉక్రెయిన్‌ తేల్చిచెబుతోంది. మరోవైపు మొదట్లో మంచి విజయాలు సాధిస్తూ ఉక్రెయిన్‌పై రోజుల్లోనే గెలిచేస్తుందనుకున్న రష్యా ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తింటోంది. ఉక్రయిన్‌ గట్టిగా పోరాడుతుండటంతో రష్యా మిస్సైళ్లను దించి భీకర దాడికి పాల్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా తీవ్ర దాడికి దిగింది. ముఖ్యంగా ఆ దేశ విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో స్వైరవిహారం చేస్తోంది. యూరోప్‌లో శీతాకాలం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ లేకపోతే ఉక్రెయిన్‌ ప్రజలు చలికి అల్లాడటం ఖాయం. దీంతో ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా రష్యా విజృంభిస్తోంది.

రష్యా దాడులతో దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్‌ వ్యవస్థ నాశనం అయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా తాజా దాడులతో తమ విద్యుత్‌ వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు.

ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌తో పాటు పలు నగరాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అలాగే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో విద్యుత్‌ అంతరాయాలకు, నీటి సరఫరా ఇబ్బందులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేసింది.

కాగా తాజాగా రష్యా.. కీవ్, ఖార్కీవ్, డ్నిప్రో, జైటోమిర్‌ ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు దిగింది. విద్యుత్‌ గ్రిడ్‌లను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆస్పత్రులు జనరేటర్ల సాయంతో నెట్టుకొస్తున్నాయి. కాగా అక్టోబర్‌ 10 నుంచి రష్యా దాడుల్లో 30 శాతం విద్యుత్‌ కేంద్రాలు నాశనమయ్యాయని చెబుతున్నారు.

కాగా తాజా దాడుల్లో భాగంగా రష్యా... ఉక్రెయిన్‌లో రెండో పెద్ద నగరమైన ఖార్కీవ్‌పై ఎనిమిది క్షిపణులతో దాడులకు దిగింది. కీవ్‌ నగరంలో సైతం భారీ దాడులు చేపట్టింది. దీంతో కీవ్‌లో మౌలిక వసతులు నాశనమయ్యాయి. తాజా దాడుల్లో మొత్తం ముగ్గురు మృతి చెందారని చెబుతున్నారు.

కాగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా... ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌ హీటింగ్, ఎలక్ట్రిక్‌ వ్యవస్థను నాశనం చేస్తోంది.

మరోవైపు ఇరాన్‌కు చెందిన షాహెద్‌–136 డ్రోన్లు 38 కూల్చేశామని ఉక్రెయిన్‌ తెలిపింది. కాగా యుద్ధంలో మొదట రష్యా ఆక్రమించుకున్న ఖార్కీవ్‌ ప్రాంతాన్ని ఇటీవల ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా తాజాగా ప్రకటించడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.