Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళం జిల్లా పేరు పై అంత రభసెందుకంటే?

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 AM GMT
శ్రీ‌కాకుళం జిల్లా పేరు పై అంత రభసెందుకంటే?
X
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పేర్లు పెట్టే విధానం పై రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ కానీ కొన్నింట ర‌గ‌డ కానీ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి ఓ ఆస‌క్తిదాయ‌క ప్ర‌తిపాద‌నే వ‌చ్చింది. బ‌హుజ‌నుల నేత, గొప్ప దార్శినికుడు, సంఘ సంస్క‌ర్త అయిన జ్యోతీరావు పులే పేరుజిల్లాకు పెట్టి ఆయ‌న‌ను స‌మున్న‌త రీతిలో గౌర‌వించుకోవాల‌ని టీడీపీ కీల‌క నేత ఒక‌రు డిమాండ్ చేస్తున్నారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ప్ర‌స్తుతం జిల్లాల పేర్ల‌కు సంబంధించి ర‌గ‌డ నెల‌కొంది. జ‌గ‌న్ ఇందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న ఇచ్చి కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు నిర్ణ‌యించిన రోజు నుంచి రోజూ ఏదో ఒక ర‌గ‌డ నెల‌కొంటూనే ఉంది.ఈ క్ర‌మంలో కొత్త జిల్లాల‌కు సంబంధించి పేర్ల విష‌య‌మై ఒక్కొక్క‌రూ ఒక్కో పేరు సూచిస్తున్నారు.గ‌తంలో శ్రీ‌కాకుళం జిల్లాకు దివంగ‌త ఎర్ర‌న్నాయుడు పేరు పెట్టాల‌ని ఓ ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది. కానీ ఎందుక‌నో అది టీడీపీ హ‌యాంలో కూడా పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు.

కానీ ఏ మాట‌కు ఆ మాట టీడీపీ హ‌యాంలో ఎర్ర‌న్న వ‌ర్థంతిని, జ‌యంతిని అధికారిక కార్య‌క్ర‌మాలుగా ప్ర‌క‌టించి, అందుకు నిధులు కేటాయించి,స‌మ‌ర్థ రీతిలో,ప్ర‌శంస‌నీయ ప‌ద్ధ‌తిలో ఎర్ర‌న్న‌కు నివాళి అర్పించింది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ హ‌యాం న‌డుస్తుంది క‌నుక కింజ‌రాపు కుటుంబం మ‌ళ్లీ ఆ ప్ర‌తిపాద‌న‌ను తీసుకువచ్చేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు.దీంతో జిల్లా పేరుకు సంబంధించి మ‌రో ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది.

ఈ ప్ర‌తిపాద‌న‌ను మాజీ విప్, తెలుగుదేశం పార్టీ శ్రీ‌కాకుళం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు కూన ర‌వి మీడియా ముఖంగా వెల్ల‌డించారు.అదేంటంటే జిల్లాకు జ్యోతిరావు పులే పేరును ఉంచాల‌ని కోరుతూ..జ్యోతిరావు పులే శ్రీ‌కాకుళం జిల్లాగా ప్ర‌క‌టిస్తే అంతా బాగుంటుంద‌ని కూడా ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ఇప్ప‌టికే అంబేద్క‌ర్ పేరును కోన‌సీమ జిల్లాకు పెట్టాల‌ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కోరిన వైనం తెలిసిందే! అదేవిధంగా శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి తాజా ప్ర‌తిపాద‌న ఒక‌టి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ నేప‌థ్యంలో జిల్లాపేరుకు సంబంధించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోనున్నారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం.మరోవైపు స్వాతంత్ర్య స‌మ‌ర యోధులు,ఎర్ర‌న్నాయుడి రాజ‌కీయ గురువు గౌతు ల‌చ్చ‌న్న పేరు జిల్లాకు పెట్టాల‌న్న డిమాండ్ ఒక‌టి మొన్న‌టి వేళ కొంద‌రు ఔత్సాహికులు,శ్రీ శ‌య‌న సామాజిక‌వ‌ర్గం ప్ర‌తినిధులు స్పీకర్ సీతారాం ద‌గ్గ‌ర ప్ర‌స్తావించి, వినతి అందించారు.దీనిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్తాన‌ని సీతారాం చెప్పారు.

పేర్ల ర‌గ‌డ ఇలా ఉండ‌గానే కొత్త‌గా రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి పాత‌ప‌ట్నం నుంచి వ‌స్తోంది.దీనిపై కూడా కొంత వివాదం న‌డుస్తున్నా ఇప్ప‌టికిప్పుడు ఏం ఈ త‌ర‌హా ప్ర‌తిపాద‌న కూడా ఒడ్డెక్కే విధంగా లేదు. అంతేకాకుండా ఐటీడీఏ (సీతంపేట‌) ను కూడా కొత్త జిల్లాల ఏర్పాటుతో శ్రీ‌కాకుళం కోల్పోయింది. ప్ర‌స్తుతం ఉన్న ఐటీడీఏ మ‌న్యం జిల్లాలో క‌లిసిపోయింది. పార్వ‌తీపురం కేంద్రంగా ఏర్ప‌డే జిల్లాకు త‌ర‌లిపోయింది. దీంతో ఐటీడీఏ ప‌రిధి పూర్తిగా లేకుండా పోయింది జిల్లాకు! ఈ నేప‌థ్యంలో మ‌రో ఐటీడీఏ ను జిల్లాకు ప్ర‌తిపాదించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.లేదంటే పాత ప‌ద్ధతిలోనే ఐటీడీఏను కొన‌సాగిస్తారా అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.