Begin typing your search above and press return to search.

మోడీ దాచిన క‌రోనా మ‌ర‌ణాలు.. లెక్క‌లు వెక్కిరిస్తున్నాయిగా!

By:  Tupaki Desk   |   9 Jan 2022 9:30 AM GMT
మోడీ దాచిన క‌రోనా మ‌ర‌ణాలు.. లెక్క‌లు వెక్కిరిస్తున్నాయిగా!
X
దేశంలో క‌రోనా వ్యాప్తి కార‌ణంగా సంభవించిన మ‌ర‌ణాల‌పై.. తాజాగా కొన్ని లెక్క‌లు వెలుగుచూశాయి. నిరంత‌రం రోజుల త‌ర‌బ‌డి దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది శ్మ‌శాన వాటిక‌ల్లో కాలిన స‌వాలు.. రోడ్డుప‌క్క‌నే పేర్చిన చితులు.. న‌దుల్లోకి వ‌దిలేసిన శ‌వాలు.. ఇలా అనే క అంశాల‌పై జ‌రిగిన అధ్య‌య‌నం తాలూకు నివేదిక‌.. ఏకంగా ఒక్క మ‌న‌దేశంలో 32 ల‌క్ష‌ల మంది క‌రోనాతో మృతి చెందార‌ని తేల్చి చెప్పింది. ఇవ‌న్నీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు తెలుసున‌ని.. కానీ, దాచిపెట్టార‌ని చెప్ప‌డం.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి దీనిపై మోడీ ఏమంటారో చూడాలి.

అధికారిక లెక్కల ప్రకారం భారత్లో ఇప్పటివరకు 4.8లక్షల కొవిడ్‌ మరణాలు నమోదైనట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ వాస్త‌వానికి.. నమోదు కాని క‌రోనా మ‌ర‌ణాలు భారీగా ఉండవచ్చనే అనుమానాలు అన్ని వ‌ర్గాల నుంచి కొన్ని నెల‌లుగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌ నాటికే దేశంలో దాదాపు 32లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం జర్నల్‌ సైన్స్‌లో ప్రచురితమైంది.

డెల్టా వేరియంట్‌ ప్రభావానికి గతేడాది భారత్‌ వణికిపోయింది. రోజూవారి కేసుల సంఖ్య గరిష్ఠంగా 4లక్షలకు చేరింది. దీంతో లక్షల మంది కొవిడ్‌ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులు అల్లాడిపోయారు. అదే సమయంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా నేతృత్వంలో ఓ సర్వే జరిగింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 2020 నుంచి జులై 2021 మధ్యకాలంలో చేపట్టిన ఆ సర్వేలో.. లక్షా 37వేల మంది నుంచి వివరాలు సేకరించారు.

ఆ సమయంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో దాదాపు 29శాతం అనగా.. 32లక్షల కొవిడ్‌ మరణాలు కొవిడ్‌ కారణంగానే జరిగినట్లు అంచనా వేశారు. కేవలం ఏప్రిల్‌-జులై 2021 మధ్యకాలంలోనే 27లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కగట్టారు.
వివిధ కారణాలతో సంభవించే మరణాలపై కొవిడ్‌కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. మరో అధ్యయనంలోనూ దాదాపు 57వేల మరణాలు (కొవిడ్‌తో, కొవిడ్‌ కానివి కలిపి) అధికంగా చోటుచేసుకున్నట్లు తేలినట్లు పరిశోధకులు వివరించారు.

ఈ రెండు అధ్యయనాలు కూడా 2021లోనే జరిగినట్లు తెలిపారు. ఇలా జరిపిన రెండు అధ్యయనాల్లోనూ సెప్టెంబర్‌ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్‌ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా సంభవించినట్లు తమ విశ్లేషణలో తేలిందని అధ్యయనకర్తలు వెల్లడించారు. కొవిడ్‌ మరణాలు నమోదు కాకపోవడానికి కొవిడ్‌ మరణ ధ్రువీకరణ, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అంశాల్లో లోపాలు కారణమైనట్లు పేర్కొన్నారు. అయితే.. దీనిలో కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా దాచి న‌ట్టు కూడా వెల్ల‌డ‌వుతోంది. దీంతో అస‌లు ఎంత మంది మృతి చెందార‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.