Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో జ‌గ‌న్ ? ఉద్యోగాల ఊసు మ‌రిచారా !

By:  Tupaki Desk   |   23 March 2022 3:30 PM GMT
మ‌రో వివాదంలో జ‌గ‌న్ ? ఉద్యోగాల ఊసు మ‌రిచారా !
X
ఉద్యోగాలు అంటే తెలంగాణ గుర్తుకు వ‌స్తోంది. ఉద్యోగాలు అంటే పంజాబ్ గుర్తుకు వ‌స్తుంది. కానీ ప్ర‌భుత్వ సంబంధ నోటిఫికేష‌న్లు అంటే మాత్రం ఎందుక‌నో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుర్తుకు రావ‌డం లేదు. జ‌గన్ స‌ర్కారు కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు కూడా ముందుకు రాక‌పోవ‌డంతో చాలా మంది నిరుద్యోగులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని క‌నీసం హోం గార్డు పోస్టుల భ‌ర్తీకి కూడా అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం ఎంతో విచార‌క‌ర‌మ‌ని టీడీపీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

ఓ వైపు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ పై తెలంగాణ‌తో పాటు రేపో మాపో పంజాబ్ స‌ర్కారు కూడా ఓ సానుకూల నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. కానీ ఇక్క‌డ మాత్రం ఆ విధంగా చ‌ర్య‌లు లేవు. జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి రాగానే స‌చివాల‌య ఉద్యోగాల భ‌ర్తీ త‌ప్ప, వ‌లంటీర్ల నియామ‌కం త‌ప్ప పెద్ద‌గా ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి తీసుకున్న చ‌ర్య‌లు ఏవీ లేవు అన్న‌ది గ‌ణాంక స‌హితంగా చెప్ప‌వ‌చ్చు.

ఈ ద‌శ‌లో స‌చివాల‌య ఉద్యోగులు కూడా పోస్టుల రెగ్యులరైజేష‌న్ పై అనేక సందేహాలు ఉన్నాయి. వారి జీతాలు కూడా ఇంకా పెర‌గ లేదు. వలంటీర్ల‌కు కూడా ఐదు వేలు రూపాయ‌ల జీతంతోనే స‌ర్దుకు పొమ్మంటున్నారు.ఈ ద‌శ‌లో ఓ పూర్తి స్థాయి జాబ్ క్యాలెండ‌ర్ ఏమ‌యినా విడుద‌ల చేస్తారా అంటే అదీ లేదు. అలాంట‌ప్పుడు ఏటా ఉద్యోగాల క‌ల్ప‌న అంటూ ఎందుకు ఊక‌దంపుడు ప్ర‌సంగాలు అంటూ మండిప‌డుతున్నారు నిరుద్యోగులు. త‌మ ఊసు మ‌రిచిపోయి జ‌గ‌న్ త‌న ప‌ని తాను చేసుకోవ‌డం అత్యంత విచార‌క‌ర‌మ‌ని అంటున్నారు.

యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో వివాదంలో చిక్కుకోనున్నారు. నిరుద్యోగుల‌కు ఏటా ఉద్యోగాలు ఇస్తామ‌ని అదేవిధంగాడీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌డంతో పాటు కీల‌క పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఆ విధంగా సంబంధిత చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌లేక‌పోతున్నార‌న్న వాద‌న ఒక‌టి విప‌క్ష పార్టీల నుంచి వ‌స్తోంది. ఎందుకంటే ఉద్యోగాల క‌ల్ప‌న అన్న‌ది ఉద్య‌మ స్థాయిలో తీసుకుని వెళ్లాల‌ని పొరుగున ఉన్న కేసీఆర్ భావిస్తూ ఎన‌భై వేలకు పైగా పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.అదేవిధంగా 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేశారు.ఇక‌పై తెలంగాణలో కాంట్రాక్టు మ‌రియు ఔట్ సోర్సింగ్ విధానాల్లో ఉద్యోగాల భ‌ర్తీ అన్న‌ది ఉండ‌నే ఉండ‌ద‌ని, సంబంధిత ప్ర‌క్రియ‌కు తాము ప్రాధాన్యం ఇవ్వ‌మ‌ని కూడా చెప్పారు. అంతేకాదు ఉపాధి హామీ ప‌థ‌కం సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

సెర్ప్, ఐకెపి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపున‌కు కూడా సుముఖ‌త వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు పంజాబ్ లో కూడా కొత్తగా ఏర్ప‌డిన ఆమ్ ఆద్మీ పార్టీ స‌ర్కారు కూడా ఇర‌వై ఐదు వేల ఉద్యోగాల భ‌ర్తీకి ముందుకు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే తీసుకున్న నిర్ణ‌యం ఇది కావ‌డం విశేషం. పోలీస్ శాఖ‌లో ప‌ది వేల ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ మిగ‌తా 15 వేల ఉద్యోగాల‌ను వివిధ శాఖ‌ల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం మీడియాకు వెల్ల‌డించింది.