Begin typing your search above and press return to search.

ఎంత బుజ్జ‌గించినా వైసీపీ క్యాడ‌ర్ విన‌డం లేదా?

By:  Tupaki Desk   |   14 March 2022 9:24 AM GMT
ఎంత బుజ్జ‌గించినా వైసీపీ క్యాడ‌ర్ విన‌డం లేదా?
X
ఏపీలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదా? ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోని అధిష్టానంపై కార్య‌క‌ర్త‌లు గుర్రుగా ఉన్నారా? ఎంత బుజ్జ‌గించినా వాళ్లు విన‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సొంత క్యాడ‌ర్ నుంచి అసంతృప్తి సెగ ఎదుర్కొంటున్న వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే వైసీపీకి క‌ష్ట‌మేన‌న్న భావ‌న క‌లుగుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అన్నింటికీ తెగిస్తే..
`
ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే బ‌లం. క్షేత్ర‌స్థాయిలో పార్టీ విజ‌యానికి క‌ష్ట‌ప‌డేది వాళ్లేదే. తాము న‌మ్ముకున్న పార్టీ కోసం దేనికైనా తెగించి నిల‌బ‌డేది వాళ్లే. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ త‌మ క్యాడ‌ర్‌కు ఎంతో ప్రాధాన్య‌త‌నిచ్చింది. కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీ విజ‌యం కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. అరెస్టులు, కేసుల‌కు కూడా భ‌య‌ప‌డ‌కుండా జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు.

త‌మ శ్ర‌మ‌కు ఫ‌లితంగా పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆనందంలో మునిగిపోయారు. ఇక త‌మ ప్ర‌భుత్వంలో అన్ని మంచి రోజులే అని మురిసిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ల‌ను వైసీపీ అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో క్యాడ‌ర్ తీవ్ర ఆవేద‌న చెందుతోంద‌ని తెలుస్తోంది. నేత‌ల‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని స‌మాచారం. వైసీపీలో ఉంటే మీకు ఓ బ్రాండ్ ఉంటుంద‌ని ఫీల్ కావాలని బిల్డ‌ప్ ఇవ్వ‌డం త‌ప్ప హైక‌మాండ్ నుంచి ఎలాంటి గుర్తింపు రావ‌డం లేద‌ని కార్య‌క‌ర్త‌లు బాధ‌ప‌డుతున్నారు.

ఆ స‌ర్వేతో రంగంలోకి..

ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ప‌నిచేసిన క్యాడ‌ర్‌కు ఇప్పుడు అధిష్టానం క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌డం లేద‌ని తెలిసింది. అందుకే గ్రామాల్లో ప్ర‌చారం చేసేందుకు వైసీపీ శ్రేణులు ముందుకు రావ‌డం లేద‌ని స‌మాచారం. పీకే టీమ్ స‌ర్వే ప్ర‌కారం గ్రామాల్లో బూత్ స్థాయిలో క్యాడ‌ర్ అస‌లు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తేలింది. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ మీద న‌మ్మ‌కం పోయింద‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చిందంటే ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు అధిష్ఠానం ఇచ్చిన గౌర‌వ‌మే అందుకు కార‌ణం. అందుకే పార్టీ విజ‌యం కోసం క్యాడ‌ర్ శ్ర‌మించింది. కానీ ఏపీలో అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు లేద‌ని స‌మాచారం. అమిత్ షా కంటే జ‌గ‌న్ ఏం గొప్ప‌వారు కాదు క‌దా అంటూ వైసీపీ శ్రేణులే ప్ర‌శ్నిస్తున్నాయ‌ని తెలిసింది.

పార్టీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న వైసీపీ క్యాడ‌ర్ గ్రామాల్లో న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్రచారం చేయ‌డం లేద‌ని టాక్‌. అందుకే జ‌నాల‌కు కూడా జ‌గ‌న్ ప‌థకాల‌పై న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేద‌ని అది చివ‌ర‌కు పార్టీకే న‌ష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. దీంతో క్యాడ‌ర్‌ను బుజ్జ‌గించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగినా.. ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని స‌మాచారం.