Begin typing your search above and press return to search.

ఏపీ బీపీ : రుణ భారం ఎంతో ? బాధ్య‌త కూడా అంతే ?

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
ఏపీ బీపీ : రుణ భారం ఎంతో ? బాధ్య‌త కూడా అంతే ?
X
ఆంధ్రావ‌నిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రో రెండేళ్లే కాల ప‌రిమితి ఉండ‌డంతో పాల‌న‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు ఒక్కొక్క‌టీ వెలుగు చూస్తున్నాయి. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ఏయే సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేయ‌నున్నామ‌న్న‌ది సంబంధిత క్యాలెండ‌ర్ ఒక‌టి విడుద‌ల చేశారు జ‌గ‌న్. దీని ప్ర‌కారం చూసుకున్నా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సంక్షేమ ప‌థ‌కాలు ఆగ‌వ‌ని తేలిపోయింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కూ చేప‌ట్ట‌నున్న సంక్షేమ ప‌థ‌కాల జాబితాను పూర్తిగా బ‌హిర్గ‌తం చేసి,ఇక‌పై ఇవేవీ ఆగ‌వ‌ని కూడా చెప్పారు.

ఓ లెక్క ప్ర‌కారం ఏటా యాభై వేల కోట్ల రూపాయ‌లు ఒక్క సంక్షేమ ప‌థ‌కాల‌కే వెచ్చిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న లెక్క ప్ర‌కారం గ‌డిచిన కాలంలో ల‌క్ష‌న్నర కోట్ల రూపాయ‌ల‌ను కేవ‌లం సంక్షేమానికే వెచ్చించార‌ని స‌మాచారం. ఆవిధంగా చూసుకుంటే ఉన్న నిధుల‌లో ఆదాయానికి మించి తెచ్చుకుంటున్న అప్పుల్లో అగ్ర‌భాగం సంక్షేమానికే వెచ్చిస్తున్నారు. ఈ ద‌శ‌లో అప్పులు లెక్క తేల్చ‌మ‌ని అడిగితే 16వేల కోట్ల రూపాయ‌ల లోటుతో ఏర్పడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇప్ప‌టిదాకా ఏడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పు ఉంద‌ని తేలింది. ఇప్పుడీ అప్పు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో ఉత్ప‌త్తి రంగాలు ఏవీ అనుకున్నంత‌గా బాలేవు. వాటి న‌డ‌క,విస్త‌ర‌ణ అన్న‌వి అస్స‌లు బాలేవు. అయినా కూడా చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న రాయితీలు కానీ చేయూత కానీ పెద్ద‌గా లేదు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు. ఈ లెక్కన చూసుకుంటే ఎక్క‌డా సంప‌ద సృష్టి కేంద్రాల‌కు తావే లేదు.

దీంతో స్థూల ఉత్ప‌త్తి క‌న్నాఅప్పులు చేస్తున్న వైన‌మే ఎక్కువ‌గా ఉంది. వ‌చ్చే రూపాయిపై కూడా అప్పులు తీసుకు వ‌చ్చి రాష్ట్రాన్ని న‌డుపుతున్న జ‌గ‌న్ కు ముందున్న కాలం స‌వాళ్లే! బ‌డ్జెట్ అనుమ‌తి లేకుండా ఖ‌ర్చు చేసిన డబ్బుల‌పై ఇప్పుడు లెక్క‌లేదు. మరోవైపు ట్రెజ‌రీ కోడ్ కూడా ఉల్లంఘించి కూడా నిధులు ప‌క్క‌దోవ ప‌ట్టించార‌న్న ఆరోప‌ణ కూడా ఉంది. దీని విలువ 48 వేల కోట్ల రూపాయ‌లు.

వీటిన్నింటిపైనా కూడా వ‌డ్డీ భారం కూడా ప‌డ‌నుంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా డ్రా చేసిన నిధుల‌పై ఇప్పుడు ఆడిటింగ్ కూడా అవ‌స‌రం.కానీ వీటిపై వైసీపీ మాట్లాడ‌కుండా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరం గురించి ఇప్ప‌టి నుంచే మాట్లాడుతుండ‌డం విశేషం.