Begin typing your search above and press return to search.

2024 ఆశ‌... 2029 అత్యాశ.... కమలానికి దారేదీ... ?

By:  Tupaki Desk   |   22 March 2022 3:30 AM GMT
2024 ఆశ‌... 2029 అత్యాశ.... కమలానికి దారేదీ... ?
X
ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే కమలం ఒక మోసపోయిన పార్టీ. అవును ఇది నిజమని వారే అంటున్నారు. తాము ప్రతీ సారి ఎదుగుతున్న దశలో పొత్తుల పేరిట కొన్ని పార్టీలు వచ్చి చిత్తు చేస్తున్నాయన్న ఆవేదన వారిలో ఉంది. దాని నుంచి బయటపడకపోవడం వల్లనే దశాబ్దాలు గడచినా ఏపీలో ఇలాగే ఉండిపోయామని వారు అంటున్నారు.

ఇక చూస్తే 1998 ఎన్నికల్లో ఏపీలో 18 శాతం ఓటు షేర్ నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ సొంతంగా గెలుచుకున్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తరువాత 1999 ఎన్నికల్లో టీడీపీ పొత్తు పేరిట తమతో జట్టు కట్టడంతో సొంతంగా సాధించిన ఓట్ల షేర్ అలా పోయిందని అంటున్నారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ బీజేపీని దూరం పెట్టింది.

అలా దశాబ్దం పాటు ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చిన బీజేపీకి 2014 ఎన్నికలు కలసివచ్చాయి. మోడీ ఇమేజ్ నాడు దేశమంతా ఉంది. అపుడు కనుక టీడీపీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తే కచ్చితంగా పది నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు కచ్చితంగా అయిదు దాకా ఎంపీ సీట్లు లభించేవని వారు పేర్కొంటున్నారు.

కానీ నాడు బీజేపీలో చక్రం తిప్పిన ఒక పెద్దాయన మూలంగా పొత్తులకు రెడీ కావాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇక దాని వల్ల తాత్కాలికంగా లబ్ది కలిగినా 2019 ఎన్నికలలో చంద్రబాబు దూరం పెట్టడంతో బీజేపీ ఓట్ల శాతం దారుణంగా పడిపోయి నోటా కంటే కూడా తక్కువగా వచ్చాయని విశ్లేషిస్తున్నారు. దీంతోనే విసిగిన ఏపీ బీజేపీ సొంతంగా ఎదుగుదామని చూస్తోందిట.

అందుకే ఏపీలో జనసేన వంటి కొత్త పార్టీలతో పొత్తు పెట్టుకుని 2024 నాటికి బలమైన పార్టీగా ఎదగాలని ప్రయత్నం చేస్తోంది. ఏపీలో రాజకీయ శూన్యతను క్రియేట్ చేయాలీ అంటే రెండు పెద్ద ప్రాంతీయ పార్టీలలో ఒక దాన్ని ఎలిమినేట్ చేయాలన్నదే బీజేపీ ప్లాన్. అందుకే 2020 జనవరిలో జనసేన‌తో పొత్తు కలిపారు

కానీ ఇటీవల ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మాత్రం కమలనాధులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని నాటి నుంచి పదే పదే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ బీజేపీకి ఇచ్చినది ఒక ఆప్షన్ మాత్రమే అంటున్నారు. మీరు వస్తే కలసి రండి, లేకపోతే నేను టీడీపీతోనే అని ఆయన చెప్పేశారు అనే అంటున్నారు.

ఈ పరిణామాలతో బీజేపీలో విస్తృతమైన చర్చ సాగుతోంది. జనసేనతో పొత్తు ఉంటే ఏపీలో ఎంతో కొంత సాధించవచ్చు. అలా కాకుండా ఒంటరిగా వెళ్తే భంగపాటు తప్పదని అంటున్నారు. అయితే అలా కనుక వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఆ పార్టీ మళ్ళీ బలపడుతుందని, తమకు విజయావకాశాలు 2029 నాటికి కూడా ఉండవని లెక్కలు వేస్తున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీ గగ కొన్ని రోజులుగా ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ సాగిస్తోంది. రాయలసీమ రణభేరి పేరిట కడపలో మీటింగు పెట్టిన తరువాత కర్నూల్ లో సమావేశం అయిన బీజేపీ కీలక‌ నేతలు పొత్తుల విషయం మీదనే సీరియస్ గా డిస్కషన్ పెట్టారని అంటున్నరు. ఇక మీడియా ముందు మాత్రం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తమకు టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండని స్పష్టం చేశారు.

అదంతా మీడియా సృష్టి అని కూడా అన్నారు. జనసేన బీజేపీ మాత్రమే కూటమిగా 2024లో అధికారంలోకి వస్తాయని ఆయన చెబుతున్నారు. అయితే బీజేపీ అంతర్గత సమావేశాల్లో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయట. పొత్తు లేకపోతే బీజేపీ చిత్తు అవుతుందని, 2029 నాటి వరకూ చూడడం అంటే అత్యాశే అవుతుంది అన్న మాట కూడా కొందరు నేతల నుంచి వస్తోందిట.

అయితే కేంద్ర స్థాయిలో బడా నాయకులు కొందరు మాత్రం టీడీపీ విషయంలో పొత్తునకు ఈ రోజుకీ సుముఖంగా లేకపోవడంతో పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మీద ఈ రోజుకీ బీజేపీ తేల్చుకోలేకపోతోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ బీజేపీ ఎన్నికల సంధ్యా సమయంలో అతి పెద్ద డైలామాలో పడింది అంటున్నారు.