Begin typing your search above and press return to search.

సీబీఎన్ వెన్నుపోటు.. జ‌గ‌న్ రూ.ల‌క్ష కోట్లు.. కానీ గెలిచారుగా ఇంకా ఏందీ గోల‌?

By:  Tupaki Desk   |   30 March 2022 4:30 PM GMT
సీబీఎన్ వెన్నుపోటు.. జ‌గ‌న్ రూ.ల‌క్ష కోట్లు.. కానీ గెలిచారుగా ఇంకా ఏందీ గోల‌?
X
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు స‌హ‌జం. అధికార పార్టీ ప్ర‌తిప‌క్షాలు మీద‌.. ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీ మీద ఇలా మాట‌ల దాడి చేసుకోవ‌డం కామ‌న్‌. కానీ ఏళ్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా కూడా పాత విష‌యాల‌పైనే కొట్టుకుంటూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించ‌డం మానేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. పాత విష‌యాన్ని ఎంత సాగ‌దీసినా ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ విష‌యాన్ని అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ తెలుసుకోలేక‌పోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎంత‌సేపు పాత విష‌యాల‌పై గొడవ ప‌డ‌డం త‌ప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడైనా ప్ర‌శ్నించారా? అని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆ వెన్నుపోటు..

చంద్ర‌బాబుపై కౌంట‌ర్ వేసేందుకు వైసీపీ నేత‌లు ప‌దేప‌దే వాడుతున్న ప‌దం వెన్నుపోటు. అవును.. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచార‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కానీ ఆ త‌ర్వాత ఉమ్మ‌డి ఏపీలో అనంత‌రం విభ‌జ‌న ఏపీలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చారు క‌దా. సీఎంగా గెలిచారు క‌దా. మ‌రి ఇప్ప‌టికీ మ‌ళ్లీ సీబీఎన్ వెన్నుపోటు అనే వ్యాఖ్య‌లు ప‌దేప‌దే చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. అప్పటి ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లో ఎద‌గ‌డం కోసం వెన్నుపోటు పొడ‌వ‌డం చాలా కామ‌న్ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలా వెన్నుపోటు అని కాకుండా గ‌త ప్ర‌భుత్వంలో బాబు వైఫ‌ల్యాలు.. ఇప్పుడు వైసీపీ చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు.

జ‌గ‌న్ అవినీతి అంటూ..

అక్ర‌మాస్తులు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకు వెళ్లి వ‌చ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అదే విష‌యంపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. జ‌గ‌న్ రూ.ల‌క్ష కోట్లు అవినీతి చేశారంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ 151 సీట్లు గెలిచి అఖండ విజ‌యం సాధించారు. 23 ఎంపీ సీట్లు సాధించారు. అంటే ప్ర‌జ‌లంతా ఏక‌ప‌క్ష‌మై జ‌గ‌న్‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. అయినా ఇంకా ఆ అవినీతి గురించి టీడీపీ ఆరోపిస్తుంటే ఎలా? అనే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌స్తుత ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం లేదు. ఉద్యోగాల ఊసే లేదు. ఉపాధి క‌ల్ప‌న లేదు. రాజ‌ధాని మీద ఏదో ఒక‌టి తేల్చాల్సి ఉంది. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదానీకి దోచి పెడుతున్న వైనం.. ఇలా టీడీపీ పోరాడేందుకు ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. కానీ ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టి ఇప్ప‌టికీ జ‌గ‌న్ అవినీతిపై ఆరోప‌ణ‌లు చేస్తుంటే ఎలా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం అధికార ప‌క్షాన్ని నిల‌దీసే స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సిన అవ‌స‌రం ఉందని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇలా పాత విష‌యాల‌పై ప‌రస్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకుంటే ఒదిగేదేమీ ఉండ‌ద‌ని నిపుణులు అంటున్నారు.