Begin typing your search above and press return to search.

జిల్లాల బాధ్య‌త‌ల‌కు మంత్రులు సిద్ధంగా లేరా.. వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   27 March 2022 2:30 AM GMT
జిల్లాల బాధ్య‌త‌ల‌కు మంత్రులు సిద్ధంగా లేరా.. వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌
X
ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సీఎం జ‌గన్ స‌న్న‌ద్ధ‌త వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రుల‌ను మానసి కంగా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే..సాధార‌ణంగా.. మంత్రివ‌ర్గంలో ఏమాత్రం ప‌ద‌వుల‌కు భంగం ఏర్ప‌డినా.. త‌ర్వాత‌.. కాలంలో ఆయా నాయ‌కులు రెబ‌ల్ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ తీసేసిన మంత్రులు(ఇద్ద‌రు మ‌హిళా మంత్రులు) పార్టీలో అంత‌ర్గ‌త శ‌త్రువులుగా మారారు. ఫ‌లితంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నిగ‌ట్టుకునివారి సామాజిక వ‌ర్గాన్ని టీడీపీకి దూరం చేశారు. ఈ ఎఫెక్ట్‌తో నాలుగు చోట్ల గెలిచే ద‌మ్ము ఉన్నా..టీడీపీ ఓడిపోయింది.

ఇలాంటి ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నావేసిన‌.. జ‌గ‌న్‌.. మంత్రుల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు. వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వులు పోయినా.. ఎవ‌రూ బెంగ పెట్టుకోవ‌ద్ద‌ని.. దీనికి మించిన కీల‌క ప‌ద‌వులు ఇస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న‌ జిల్లా ల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మించి.. పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తాన‌ని.. జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే.. మంత్రుల్లో చాలా మంది దీనికి స‌న్నద్ధంగా లేరు. ఎందుకంటే... మంత్రి వ‌ర్గంలో ఉంటే.. ఆ హుందా వేరు. ఆ గౌర‌వం వేరు. ఎలాంటి చిక్కులూ లేవు.

అవ‌స‌ర‌మైతే.. అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. లేక‌పోతే.. లేదు. కానీ, రేపు జిల్లా ఇంచార్జ్‌లుగా వెళ్తే.. జిల్లా పార్టీ బాధ్య‌త‌ల‌ను నెత్తిన వేసుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రినీ బుజ్జ‌గించాలి. వారి కోరిక‌లు తీర్చాలి. పార్టీని ముందుకు న‌డిపించాలి. పైగా ప్ర‌జ‌ల డిమాండ్ల‌కు స‌మాధానం చెప్పాలి. అభివృద్ధి గురించిన అంశాల‌పై దృష్టి పెట్టాలి. మ‌రోవైపు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు వేసే ఎత్తుగ‌డ‌ల‌కు.. పై ఎత్తులు వేయాలి. స‌మాధానాలు చెప్పాలి. కార్య‌క‌ర్త‌ల‌న‌ను బ‌లోపేతం చేయాలి. ఈ క్ర‌మంలో ఆర్థికంగా కూడా కొంత ఖ‌ర్చు పెట్టాలి.

ఇవ‌న్నీ.. చేయ‌డం అంటే. చాలా మంది మంత్రుల‌కు త‌ల‌కు మించిన భారంగా అనిపిస్తోంద‌ట‌. అందుకే.. మాకు జిల్లాలు వ‌ద్దు.. ఏమీ వ‌ద్దు.. ఉంటే మంత్రిగా ఉంచండి.. లేక‌పోతే.. మీఇష్టం.. అంటూ.. కొంద‌రు మంత్రులు తెర‌చాటున వ్యాఖ్యానిస్తున్నారు. ``ఆయ‌న‌ను న‌మ్మాం. ప‌ద‌వి ఇచ్చారు. కానీ, ఇప్పుడు తీసేస్తామంటున్నారు. జిల్లా బాధ్య‌త‌లు అంటే మా కు అవ‌స‌రం లేదు. మా నియోజ‌క‌వ‌ర్గంలోనే బోలెడు స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇక‌, జిల్లా బాధ్య‌త‌లు ఎలా చూస్తాం!`` అని అనంత‌పురానికి చెందిన ఒక మంత్రి త‌న అనుచ‌రుల‌తో వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి వారు మ‌రో న‌లుగురు ఉన్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.