Begin typing your search above and press return to search.

రేవంత్ రిక్వెస్టును ఓకే చేసిన రాహుల్.. ఫైర్ బ్రాండ్ కు తిరుగులేనట్లు

By:  Tupaki Desk   |   31 March 2022 5:54 AM GMT
రేవంత్ రిక్వెస్టును ఓకే చేసిన రాహుల్.. ఫైర్ బ్రాండ్ కు తిరుగులేనట్లు
X
రెండు అడుగులు ముందుకు వేస్తే.. మూడు అడుగులు వెనక్కి లాగేలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నా ఫర్లేదు.. తమ వ్యక్తిగత అంశాలకు పెద్ద పీట వేస్తూ.. పార్టీ ప్రయోజనాల్ని సైతం పణంగా పెట్టేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గని తీరు కనిపించటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధిగా పగ్గాలు చేపట్టిన రేవంత్.. పార్టీని బలోపేతం చేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

రేవంత్ తీరును జీర్ణించుకోలేని కొందరు.. ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పటమే కాదు.. అధినాయకత్వం వద్దకు వెళ్లి కంప్లైంట్లు చేసే ప్రయత్నం చేయగా.. వారందరికి ఎదురుదెబ్బలు తగలటం.. కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం ద్వారా.. తాము రేవంత్ పక్షాన ఉన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న రేవంత్.. ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతూ గళం విప్పటమే కాదు.. ఏప్రిల్ లో నిర్వహించే సభకు రాహుల్ ను ఆహ్వానించారు.

ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు. దీంతో.. ఫైర్ బ్రాండ్ రేవంత్ కు తిరుగులేదని చెబుతున్నారు. అధిష్టానం రేవంత్ కు అండగా ఉందన్న విషయం తాజా భేటీతో స్పష్టమైందని చెప్పాలి. అంతేకాదు.. ఇటీవల తామునిర్వహించిన సభ్యత్వ నమోదుకు సంబంధించిన కార్యక్రమాన్ని అంచనాలకు మించి చేసిన వైనాన్ని రాహుల్ కు వివరించారు. దేశంలోనే అత్యధిక కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను తెలంగాణలో చేపట్టిన తీరుపై రేవంత్ ను రాహుల్ అభినందించారు.

పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలోని నల్గొండ నియోజకవర్గం పార్టీ సభ్యత్వ నమోదులో ప్రధమ స్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. రెండో స్థానంలో పెద్దపల్లి నిలిచినట్లుగా రాహుల్ కు వివరించారు. ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి రైతులు.. నిరుద్యోగులు.. అమరవీరులు.. ఉద్యమకారుల సమస్యలపైన పోరాడనున్నట్లుగా పేర్కొన్న రేవంత్ ను.. రాహుల్ అభినందించారు. తాజాగా భేటీని చూసినప్పుడు రేవంత్ నాయకత్వంపై పార్టీ అధిష్ఠానం పూర్తి భరోసాతో ఉన్న విషయం స్పష్టమైందంటున్నారు. దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ రేవంత్ తగ్గేదెలే అన్నట్లుగా వ్యవహరించొచ్చన్న మాట వినిపిస్తోంది.