Begin typing your search above and press return to search.

జీ 23 మీటింగులు ఎన్నిపెడితే ఏం ఉపయోగం ?

By:  Tupaki Desk   |   17 March 2022 4:14 AM GMT
జీ 23 మీటింగులు ఎన్నిపెడితే ఏం ఉపయోగం ?
X
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తునే ఉంది. పార్టీలోనే అంతర్గతంగా తయారైన జీ 23 లీడర్ల సమావేశం జరిగింది. ఇప్పటికే నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ ఫ్యామిలీ తప్పుకోవాలన్న కపిల్ సిబల్ డిమాండ్ పై మెజారిటీ నేతలు మండిపోతున్నారు. ఏదో ఒక డిమాండుతో జీ 23 నేతలు పార్టీలో అప్పుడప్పుడు అలజడులు రేపుతున్న విషయం అందరు చూస్తున్నదే.

తాజా ఘోర ఓటములతో ఈ అలజడి మోతాదు కాస్త ఎక్కువైందంతే. నిజానికి జీ 23 గ్రూపులోని చాలామంది నేతలకు జనాలతో పెద్దగా సంబంధాలే లేవు. గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనందశర్మ, జై రామ్ రమేష్, పీజే కురియన్, పరిణీత కౌర్, రజనీపాటిల్ లాంటి చాలామంది నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది చాలా తక్కువ. ఎప్పుడైనా పోటీచేసినా గెలిచింది ఇంకా తక్కువ. పార్టీ ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు వీళ్ళల్లో చాలామంది రాజ్యసభ ఎంపీలైపోయి మంత్రివర్గాల్లో చక్రం తిప్పినవాళ్ళే.

సోనియాగాంధీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకుని వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా వెళ్ళి అపరమితమైన అధికారాలను అనుభవించిన వాళ్ళే. ఇలాంటి నేతలంతా ఇపుడు పార్టీ పూర్వవైభవాన్ని పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న సమయంలో గాంధీ ఫ్యామిలీ మీద బండలేస్తున్నారు. నిజానికి ఇలాంటి నేతలు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా పార్టీకి వచ్చే నష్టమేమీలేదు. ఎందుకంటే వీళ్ళల్లో చాలామందికి జనాలతో అసలు సంబంధాలే లేవు. ఇలాంటి నేతలు ఎన్ని మీటింగులు పెట్టుకుంటే ఏమవుతుంది ?

పార్టీ ప్రక్షాళన జరగాలన్న విషయంలో రెండో ఆలోచన లేదు. పై నుండి కింద స్థాయి వరకు నాయకత్వాల్లో మార్పు రావాల్సిందే. జనబలం ఉన్న నేతలకు రాష్ట్రాల్లోనూ, కేంద్రస్ధాయిలోను పగ్గాలు అప్పగించాల్సిందే. యువతను ప్రోత్సహించినపుడే యూత్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతారు. జనాల్లో పార్టీ అంటే అభిమానముంది. కాకపోతే నాయకత్వ లోపం కారణంగానే ఓట్లు వేయించుకోలేకపోతోంది. కాబట్టి పూర్తి స్ధాయిలో ప్రక్షాళన జరిగితే పార్టీ దానంతటదే భవిష్యత్తులో అయినా బలోపేతం అవుతుంది.