Begin typing your search above and press return to search.

శుభ‌కృత్ : ఒక ఆవాహ‌న.. స్వాగ‌తం కూడా !

By:  Tupaki Desk   |   2 April 2022 4:25 AM GMT
శుభ‌కృత్ : ఒక ఆవాహ‌న.. స్వాగ‌తం కూడా !
X
పండగ‌కు విశిష్ట ల‌క్ష‌ణం ఉంటుంది. అది అంద‌రికీ చెందింది క‌నుక అందులో సామ్య వాదం ఉంటుంది. అది అంద‌రిలోనూ కొత్త కాంతులను పుట్టించి వెళ్తుంది క‌నుక ఇక ప‌ర అనే భావ‌న వ‌దిలి వెళ్తే సొంతం అయిన క్ష‌ణాల‌లో మ‌నుషులకు స‌మాన‌త్వం ఒక‌టి తెలిసి వ‌స్తుంది. మ‌నుషుల‌కు స‌మానత్వం సౌభ్రాత‌త్వం ఉప‌దేశించి వెళ్ల‌డమే పండ‌గ క‌ర్త‌వ్యం. అదే తీపి. దాని పాటింపు చేయ‌క‌పోవ‌డం చేదు. చేదు సంబంధ అనుభ‌వం అని కూడా రాయాలి. చేదు అంటే ఇత‌రుల దుఃఖం అని, నీ ఒక్క‌డి దుఃఖమే కాదు..అని ఆ విధంగా కూడా అర్థం తీసుకుంటే మేలు. దుఃఖ నాశ‌ని పండగ.. ప‌ది త‌ల‌ల ప‌ర‌మ శివ‌త‌త్వం పండగ. సంతోషం ఒక్క‌టే కాదు స్వానుభ‌వ విశ్లేష‌ణ కూడా పండ‌గే ! అటువంటి స్వాగతం ఈ ఉద‌యం..అటువంటి ఆవాహ‌న ఈ ఉద‌యం.

మ‌నుషులంతా త‌మ‌ని తాము మ‌రిచిపోయి ఇత‌రుల కోసం ఆలోచించిన క్ష‌ణాలు అద్భుతం అయి ఉంటాయి. అంటే స్వార్థ చింత‌న ఒక‌టి లేకుండా ఉంటే ఆ క్ష‌ణాలు బాగుంటాయి. కానీ ఇవి ప్ర‌తిపాదించినంత సులువు కాదు. కాలం కొన్ని ఆదేశాలు ఇచ్చి వెళ్తుంది. అందులో ఒక‌టి ప‌ర పీడ‌న వ‌ద్ద‌ని.. ఆ విధంగా మ‌నం అనుకున్న ప్రాంత‌మంతా సుభిక్షంగా ఉంటూ, మ‌న అనుకున్న వారి సుఖం మ‌రియు శాంతిని కోరుతూ.. స‌క‌ల సౌభాగ్యాల‌ను పొంద‌డమే పండ‌గ ప‌ర‌మార్థం. ఉగాది అనే తెలుగు లోగిలి చెంత సంద‌డి చేస్తున్న పండ‌గ ప‌ర‌మార్థం.విశేషార్థం కూడా ఇదే!

నిరంత‌రం అని అనుకున్న‌దేదీ ఆగిపోదు. నిత్యం అనుకున్న‌దేదీ మంగ‌ళం కాకుండా ఉండ‌దు. మ‌హ‌త్తు అన్న‌ది ఒక‌టి ఉంటుంది. మ‌హిమాన్విత ధోర‌ణి అని ఒక‌టి ఉంటుంది. వీటిని గుర్తించ‌డం బాధ్య‌త. కాలం మ‌హ‌త్తు సంబంధం క‌నుక మ‌హ‌త్యం ఏంట‌న్న‌ది మ‌న‌కు తెలుస్తుంది. మహిమ ఒక‌టి ఉంటుంది. మాయ కూడా ఉంటుంది. మాయా మ‌హిమ‌లు అన్న‌వి తేట‌తెల్లం కావని తేలిపోతుంది కొన్ని సార్లు. శుభ కృత్ మ‌హిమ‌లు ప్ర‌సాదించాలి. వ‌రాలు ఇవ్వాలి.. కాలానికి కాస్త కొత్త ప‌రుగు ఇవ్వాల‌ని కోరుకోవ‌డంలో అర్థం ఉంది. ఔన్న‌త్యం కూడా ఉంది.

ఏ దారి అయినా సుసంప‌న్నం కావాలంటే ముందు నిర్దేశితం అన్న‌ది స్ప‌ష్టం అయి ఉండాలి. కాలం కూడా అంతే క‌దా ! అడ్డ‌దిడ్డ‌మ‌యిన దారుల్లో నడిపించ‌నూ గ‌ల‌దు.. ముళ్ల‌ను తొక్కించి పూల పాన్పు అదిగో అని చూపించ‌నూ గ‌ల‌దు. తెలుగువారికి కొత్త ఏడాది శుభ‌కృత్. అందుకు అన‌గా ఆరంభం ఈ రోజు. ప్రారంభ సంరంభాల వేళ రామ‌య్య తండ్రి దీవెన‌లు అందుకోండి. నిత్యం అని ఒక‌టి వెలుగు.. నిత్యం అన్న‌ది ఒక‌టి నిత్య‌కృత్యం అయి వెలిగే వెలుగు. వెలుగును చేబూని చేయూత‌కు ప్రాధాన్యం ఇస్తే ఇత‌రులు మీ వాళ్లు మీ అనుకున్న వాళ్లంతా ఇక‌పై ప‌ర అన్న భావ‌న‌లో ఉండరు.

కనుక కాలం ఇత‌రం అన్న భావ‌న‌ను చెరిపేయ‌డం బాధ్య‌త‌గా చేసుకోవాలి. వ‌స్తున్న కాలంలో ఇత‌రం అన్న భావన ఉండకూడ‌దు. నా అనే ఈ చిన్న ప్ర‌పంచంలో విస్తృతం ఉంది. విస్తృతార్థ రీతి ఉంది. రీతిని అర్థం చేసుకుని గుణాన్ని అర్థం చేసుకుని ల‌క్ష‌ణ సంబంధ కాలాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ల‌డ‌మే శుభ‌కృత్ ఇస్తున్న ఆదేశం. సంబంధిత కాలం ఇచ్చే ఆజ్ఞ అని రాయాలి.