Begin typing your search above and press return to search.

8 మంది స్వదేశీ.. ఇద్దరు విదేశీ... ఐపీఎల్ కెప్టెన్లలో ఎవరేంటో చూద్దామా?

By:  Tupaki Desk   |   26 March 2022 11:32 AM GMT
8 మంది స్వదేశీ.. ఇద్దరు విదేశీ... ఐపీఎల్ కెప్టెన్లలో ఎవరేంటో చూద్దామా?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరికాసేపట్లో తెరలేవబోతోంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. 15వ ఎడిషన్.. రెండేళ్ల తర్వాత స్వదేశంలో పూర్తిస్థాయిలో జరుగనుంది. ఈసారి జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరిగింది. కొత్తగా లఖ్ నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వచ్చాయి. లీగ్ ఫార్మాట్ కూడా మారింది. ఐదు జట్లు రెండేసి గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. అయితే, జట్లు పెరిగినా.. కెప్టెన్ల సంఖ్య రీత్యా భారతీయులే అధికంగా ఉన్నారు. మొత్తం 10 జట్లలో 8 జట్లకు టీమిండియా క్రికెటర్లే సారథ్యం వహించనున్నారు.

ఇద్దరే విదేశీయులు

కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్), ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు).. వీరిద్దరే లీగ్ లో విదేశీ కెప్టెన్లు. మిగతావారంతా... రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌), రవీంద్ర జడేజా (చెన్నై సూపర్‌ కింగ్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), కేఎల్‌ రాహుల్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌), హార్దిక్‌ పాండ్యా (గుజరాత్‌ జెయింట్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (పంజాబ్‌ కింగ్స్‌), సంజూ
సామ్సన్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) భారతీయులే.

కొత్త కెప్టెన్లు ఎవరంటే..

విదేశీయులా? స్వదేశీయులా? అనే విషయం ఐపీఎల్ కు పెద్దగా వర్తించదు. 15 ఏళ్లుగా అలాంటి విభజనేమీ లేకుండా భాగమైపోయింది లీగ్. కాగా, ఈసారి లీగ్ లో డుప్లెసిస్, జడేజా, పాండ్యా, మయాంక్ అగర్వాల్ కొత్త కెప్టెన్లు. వీరిలో జడేజా, అగర్వాల్ మినహా మిగతావారంతా ఇతర జట్లలో భాగస్వాములు. శ్రేయస్ అయ్యర్ ఢిల్లీకి, రాహుల్ పంజాబ్ కు కెప్టెన్సీ చేశారు. అయితే, ఈసారి జట్టు మారారు. పాండ్యా ముంబైకి ఆడాడు. అగర్వాల్, జడేజా ఆడుతున్న జట్లకే కెప్టెన్ అయ్యారు. ఇక డేవిడ్ వార్నర్ వైఫల్యం తర్వాత సన్ రైజర్స్ విలియమ్సన్ పై ఆధారపడుతోంది. విరాట్ కోహ్లి వైదొలగడంతో డుప్లెసిస్ కు కెప్టెన్సీ దక్కింది. అతడు గతేడాది వరకు చెన్సై సూపర్ కింగ్స్ కు ఓపెనర్ గా ఆడాడు. ఈసారి మాత్రం వస్తూనే జాక్ పాట్ కొట్టాడు.

ఈసారి అంత వీజీయేం కాదు..

మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా కెప్టెన్సీ వద్దనుకోవడంతో రవీంద్ర జడేజాకు చాన్స్ దొరికింది. మిగతావారిలో రోహిత్ శర్మ.. ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపాడు. సంజు.. రాజస్థాన్ ను కిందామీద పడుతూ నడిపిస్తున్నాడు. పంత్.. గతేడాది ఢిల్లీ రాత మార్చాడు. వీరికే కాదు... ఈసారి మిగతా జట్ల కెప్టెన్లకూ అంత వీజీయేం కాదు. ముగ్గురు, నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్నందున.. మిగతా జట్టంతా కొత్తదిగానే భావించాలి. వారితో కూర్పు.. ఫలితం రాబట్టడం సారథులకు సవాలే. మరేం జరుగుతుందో.. చూద్దాం..