Begin typing your search above and press return to search.

200 చాలడం లేదు.. 250 కొట్టాలేమో..? దద్దరిల్లుతున్న ఐపీఎల్ -15

By:  Tupaki Desk   |   1 April 2022 2:30 PM GMT
200 చాలడం లేదు.. 250 కొట్టాలేమో..? దద్దరిల్లుతున్న ఐపీఎల్ -15
X
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వస్తూ వస్తూనే పరుగుల ప్రవాహాన్ని మోసుకొస్తోంది. 200 టార్గెట్ కూడా సరిపోనంతగా బ్యాట్స్ మన్ విధ్వంసం సాగుతోంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 210 పరుగుల లక్ష్యాన్ని కూడా లక్నో సూపర్ జెయింట్స్ కొట్టిపారేసింది. ఈ మ్యాచ్ లో తొలుత చెన్నై రాబిన్‌ ఉతప్ప (50; 27 బంతుల్లో 8x4, 1x6), శివమ్‌ మావి (49; 30 బంతుల్లో 5x4, 2x6) దంచికొట్టడంతో పాటు మొయిన్‌ అలీ (35;22 బంతుల్లో 4x4, 2x6) మెరవడంతో 210/7 భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం లక్నో ఓపెనర్లు రాహుల్‌ (40; 26 బంతుల్లో 2x4, 3x6), క్వింటన్‌ డికాక్‌ (61; 45 బంతుల్లో 9x4) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. కానీ, స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిపోవడంతో ఆ జట్టు తడబాటుకు గురై రన్‌రేట్‌ పెరిగింది. దీంతో లఖ్‌నవూ ఓటమిపాలయ్యేలా కనిపించింది.

అయితే, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవిన్‌ లూయిస్‌ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 6x4, 3x6), ఆయుష్‌ బదోని (19;9 బంతుల్లో 2x6) ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. లూయిస్‌, బదోని ధాటిగా ఆడి మూడు బంతులు మిగిలి ఉండగానే రికార్డు ఛేదన చేశారు. ఇక తాజా సీజన్‌లో మార్చి 27న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 205/2 భారీ స్కోర్‌ సాధించగా.. పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌ (88; 57 బంతుల్లో 3x4, 7x6) ధాటిగా ఆడాడు. పంజాబ్‌ జట్టులో ధావన్‌ (43), రాజపక్స(43), షారుఖ్‌ ఖాన్‌ (24 నాటౌట్‌), ఓడియన్‌ స్మిత్‌ (25 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

హైదరాబాద్ అందుకోలేకపోయింది

గత నెల 29న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 210 పరుగులు చేసింది. కానీ, దీనిని సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకోలేకపోయింది. ఇప్పటివరకు 15వ సీజన్ లో ఏడు మ్యాచ్ లు 14 ఇన్నింగ్స్ లు జరగ్గా ఐదుసార్లు 200 పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే.. జట్లు ఎంతటి జోరుమీదున్నాయో తెలుస్తోంది. ఇక గత నెల 27న జరిగిన మ్యాచ్ లో ముంబై విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 8 బంతులుండగానే ఛేదించింది.

చూస్తుంటే.. ఈసారి లీగ్ లో 250 టార్గెట్ అయితేనే గెలుపుపై నిశ్చింతగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా,లీగ్ లో ఇప్పటివరకు ఒక్కసారే 250 పైగా స్కోరు నమోదైంది. మొత్తమ్మీద అత్యధిక స్కోరు 263/5. పుణె వారియర్స్ పై బెంగళూరు రాయల్ చాలెంజర్స్ దీనిని 2013 సీజన్ లో సాధించింది. రెండో అత్యధిక స్కోరు 248/3 కూడా బెంగళూరుదే. దీనిని 2016లో గుజరాత్ లయన్స్ పై నమోదు చేసింది.