Begin typing your search above and press return to search.

ఆరుగురు డిప్యూటీలు... జగన్ మార్క్ ఈక్వేషన్స్...?

By:  Tupaki Desk   |   31 March 2022 12:30 PM GMT
ఆరుగురు డిప్యూటీలు... జగన్ మార్క్ ఈక్వేషన్స్...?
X
ఈసారి అయిదు కాదు ఆరు అంటున్నారు. ఈ నంబర్ ఏంటి అంటే పొలిటికల్ గా ఆసక్తికరమే. రాష్ట్ర మంత్రివర్గంలో ఈసారి ఆరుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2019లో జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినపుడు ఏకంగా అయిదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఆనాడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. దానికి ముందు చంద్రబాబు జమానాలో బీసీ, కాపులకే డిప్యూటీ సీఎం హోదా దక్కింది. మరో వైపు చూస్తే జగన్ జాగ్రత్తగా ప్రాంతీయ సమతూల్యతను ఈ విషయంలో చూసుకున్నారు.

ఉత్తరాంధ్రా, కోస్తా, రాయలసీమలకు కూడా సమ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇపుడు అగ్ర వర్ణాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని ఒకరికి ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ పదవి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కానీ వైశ్య వర్గానికి కానీ దక్కే అవకాశం ఉంది.

అలా కనుక చూసుకుంటే వైశ్యుల నుంచి మంత్రి చాన్స్ ఉందంటున్న కోలగట్ల వీరభద్రస్వామికి కానీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మల్లాది విష్ణు, కోన రఘుపతిలలో ఒకరికి కానీ డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది అని టాక్ నడుస్తోంది.

జగన్ ప్రభుత్వం మీద అగ్రవర్ణాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న క్రమంలో వారిని ఆకట్టుకోవడానికే ఈ రకమిన సమీకరణలను ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మంత్రి వర్గం కూర్పులో ఏ ఒక్క వర్గాన్ని తగ్గించకుండా అందరినీ కలుపుకుని పోవాలన్న కసరత్తు అయితే జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.