Begin typing your search above and press return to search.

జనసైన్యం పెరిగింది... గ్రౌండ్ రియాలిటీస్ ఇవే ... ?

By:  Tupaki Desk   |   18 March 2022 6:55 AM GMT
జనసైన్యం పెరిగింది... గ్రౌండ్ రియాలిటీస్ ఇవే ... ?
X
మేము గతంలో మాదిరిగా చిన్నగా లేము, మేము ఏమీ తక్కువ కాదు, చాలా మంది కంటే ఎక్కువే. దాదాపుగా ఇలాంటి అర్ధం వచ్చేలాగానే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో గర్జించారు. నిజానికి ఏ పార్టీ బలం అయినా అలా ఒకే మాదిరిగా ఉండిపోదు, కాలానుగుణంగా అది పెరగవచ్చు, తగ్గవచ్చు కూడా. అయితే జనసేన బలాన్ని 2019 ఎన్నికలో వచ్చిన ఆరు శాతం ఓట్లనే తీసుకుని అక్కడే ఉంటే పొరపాటనే జనసేనాని సభలో నొక్కి వక్కాణించారు.

ఆయన చెప్పిన లెక్కలు వివరాలు కూడా అందరికీ తెలిసినవే. ఏపీలో 27 శాతం ఓటు బ్యాంక్ తమకు ఉందని ఆయన చెప్పుకున్నారు. ఆదే సమయంలో టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గింది అని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. అసలు ఇంతకీ ఈ ఓట్ల లెక్కలు ఏంటి, వాటి కధా కమామీషూ ఏంటి అంటే అక్కడ ఉంది రాజకీయం.

రేపటి రోజున మిత్రుల మధ్య సీట్ల ఒప్పందం కనుక జరిగితే ఈ ఓట్ల శాతమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఆ మధ్య మాట్లాడుతూ పొత్తులు జనసేనతో పెట్టుకుంటామన్నట్లుగానే చెప్పారు. అదే టైమ్ లో సీట్ల పంపిణీలో తేడాలూ గొడవలు వచ్చే సీన్ లేదని కూడా అన్నారు. వారికి ఆరు శాతం ఓటింగ్ ఉంది కాబట్టి దాన్ని బట్టే సీట్ల పంపకం ఉంటుందన్నట్లుగా హింట్ ఇచ్చారు.

ఇపుడు అదే పెద్ద పంచాయతీగా జనసేన చూస్తోంది అంటున్నారు. అందుకే నిండు సభలో పవన్ తమ బలాన్ని గట్టిగా చెప్పుకున్నారు. ఏపీలో తమకు 27 శాతం ఓటింగ్ ఉందని, ఇంకా పెరుగుతుందని ఆయన అంటున్నారు. మరి దీని మీద కొలతలు ఎవరు కొలుస్తారు, లెక్కలు ఎవరు చూస్తారు అంటే చూడాల్సిన చోట ఎవరైనా చూడాల్సిందే.

నిజానికి గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తే ఏ పార్టీ బలం ఏంటి అన్నది తెలుస్తుంది. జనసేన ఈ మూడేళ్ల కాలంలో బాగా పెరిగింది. అది కూడా గోదావరి జిల్లాల్లోనే బాగా పెరిగింది. గతంలో అయిదారు శాతంగా ఉన్న ఓటింగ్ ఇపుడు పన్నెండు శాతంగా పెరిగింది అని అంటున్నారు. అంటే అది జనసేన చెప్పుకున్నట్లుగా అంత ఎక్కువగా కాదు, అలాగే టీడీపీ సహా ఇతర పార్టీలు తగ్గించినట్లుగా అరడజన్ శాతంగా కూడా కాదు అని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం పోలరైజ్ అవుతోంది. వారు జనసేనను తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. ఆవిర్భావ సభకు వచ్చిన జనాలు కూడా వారిలో అత్యధిక భాగం ఉంటారని అంటున్నారు. ఇక ఆ సామాజికవరంలో కసి ఎంతలా ఉంది అంటే జనసేన అధికారంలోకి రావాలి, పవన్ సీఎం కావాల్సిందే అనేటంతగా.

ఇక గతంలో కాపులు టీడీపీ వైసీపీ, జనసేనల మధ్య సర్దుకున్నారు. కానీ ఇపుడు చూస్తే 2019లో వైసీపీకి ఓటేసిన కాపులు దాదాపుగా పెద్ద ఎత్తున జనసేనకు జై కొడుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే సంప్రదాయ కాపులలో పెద్దలు ఆ వైపునే ఉంటే కుర్రకారు అంతా జనసేనకి జిందాబాద్ అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తే మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేన ఇంకా బలపడి ఓట్ల షేర్ పెంచుకునే చాన్స్ అయితే ఉందని అంటున్నారు.

ఇక జనసేన బలం అంతా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరులలో బలమైన కాపు సమాజిక వర్గం ఉన్న చోట. అలాగే ఉత్తరాంధ్రాలో విశాఖలో కొన్ని చోట్లా ఉందని తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే దాదాపుగా యాభై స్థానాల్లో ఈ రోజుకు జనసేన బలమైన శక్తిగా ఉందని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఆ లెక్క చూసుకుంటే మొత్తం సీట్లలో పాతిక వంతు జనసేన వాటా అనుకోవాలి.

మరి ఏపీలో 175 సీట్లలో యాభై సీట్ల బలం ఉన్న జనసేన గర్జిస్తే తప్పు కాదుగా. అందుకే పవన్ రాష్ట్ర బాధ్యతలు తనవని ధీమాగా చెబుతున్నారు. ఇక జనసైనికులు కూడా పవనే సీఎం అని గట్టిగా నినదిస్తున్నారు. వీటికి తోడు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా బలం పెంచుకుని జనసేన దూసుకుపోతే ఏపీలో 2024 నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారే సీన్ ఉందనే అంటున్నారు.