Begin typing your search above and press return to search.

టీఢీపీ : మ‌ళ్లీ వివాదంలో ?

By:  Tupaki Desk   |   1 April 2022 6:05 PM GMT
టీఢీపీ : మ‌ళ్లీ వివాదంలో ?
X
ఆడ‌బిడ్డ‌ల‌ను అక్కా, చెల్లి అని సంబోధించి ఓట్లు తెచ్చుకున్న జ‌గ‌న్ ఇవాళ ఎందుక‌నో అదే ఆడబిడ్డ‌ల విష‌య‌మై త‌మ నాయ‌కుల భాష‌ను మాత్రం అస్స‌లు నియంత్రించ‌లేక‌పోతున్నార‌న్నది ఓ విమ‌ర్శ.ఇదే వాస్త‌వం కూడా ! ఇప్పుడు మీరు వెళ్లండి జ‌గ‌న్ పాద‌యాత్రకు..జ‌నం మిమ్మ‌ల్ని స్వాగ‌తిస్తారో..లేదా తిరస్క‌రిస్తారో తెలుస్తుంది అంటూ టీడీపీ నాయ‌కులు వైసీపీకి స‌వాలు విసురుతున్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ్య‌క్తిగ‌త జీవితాల‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడ‌డం అన్న‌ది ఓ ఆన‌వాయితీ గా మారిపోయింద‌ని టీడీపీ ఆవేద‌న చెందుతోంది. అసెంబ్లీ లోప‌ల,బ‌య‌ట ఇదే విధంగా గౌర‌వ అధికార పార్టీ స‌భ్యుల తీరు ఉంద‌ని, ఓ డిబెట్ కు వ‌చ్చినా కూడా ముందు బూతుల‌తోనే మొద‌లుపెట్టి త‌రువాత విష‌యాన్ని ప‌క్క‌దోవ పట్టించి, అనైతిక ధోర‌ణిలో ప్ర‌వ‌ర్తించ‌డం అన్న‌ది ఎంత మాత్రం స‌బ‌బు కాద‌ని టీడీపీ అంటోంది.

అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా వైసీపీ భాష గురించి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. మంత్రులు మొద‌లుకుని చిన్న స్థాయి నాయ‌కుల వ‌ర‌కూ నోటికి వ‌చ్చిన విధంగా బూతులు మాట్లాడుతున్న ఘ‌ట‌న‌లు ఆన్ రికార్డ్ న‌మోదు అవుతూనే ఉన్నాయి.అయినా కూడా వైసీపీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అధిష్టానం కూడా ఇటువంటి భాష‌ను వాడ‌వ‌ద్ద‌ని సంబంధిత నాయ‌కుల‌ను నియంత్రించిన దాఖలాలు లేవు. ఆడ బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోసం మాట్లాడుతున్న ఓ టీడీపీ నాయ‌కురాలిని కించ‌ప‌రుస్తూ ఓ వైసీపీ లీడ‌ర్ మాట్లాడిన తీరు అత్యంత అవ‌మానక‌ర రీతిలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ అమాన‌క‌ర ఘ‌ట‌న ఇది..వివరాలివి..

ఆమె శ్రీ‌కాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ . పేరు కావలి గ్రీష్మ. మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభాభార‌తి కుమార్తె. ఓ టీవీ డిబెట్ కు వెళ్లిన ఆమెను ఉద్దేశించి అవ‌మానక‌ర రీతిలో మాట్లాడిన వైనంపై ఆమె ఆవేద‌న చెందుతున్నారు. రాష్ట్రంలో మహిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు అన్న విష‌య‌మై తాము గొంతుక వినిపిస్తుంటే దానికి స‌మాధానం చెప్ప‌కుండా నీపై రేప్ జ‌రిగిందా నీపై ఎవ్వ‌రైనా రేప్ అంటెప్ట్ చేశారా అంటూ దిగ‌జారిన భాష‌లో ఆయ‌న మాట్లాడారు. దీనిపై ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ ఓ వీడియో విడుద‌ల చేశారు.

త‌మ కుటుంబం విలువ‌ల‌ను న‌మ్ముకుని రాజ‌కీయం చేస్తున్న కుటుంబం అని, త‌న తాత జ‌స్టిస్ కొత్తప‌ల్లి పున్న‌య్య ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు కేరాఫ్‌గా నిలిచార‌ని,అదేవిధంగా ద‌ళితుల ప‌క్షాన ఉండి పోరాడార‌ని, త‌న త‌ల్లి కావ‌లి ప్ర‌తిభా భార‌తి ఉమ్మ‌డి రాష్ట్రానికి తొలి మ‌హిళా స్పీక‌ర్ అని, తాను ఒక ఉన్న‌త విద్యావంతురాలిన‌ని ఇవేవీ తెలియ‌కుండా నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడి ద‌ళితురాలినైన తన‌ను కించ‌ప‌రిచి మాట్లాడ‌డం త‌గునా అని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. ఆ విధంగా వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేస్తూ మాట్లాడితే మ‌రి డిబెట్ల‌లో పాల్గొనర‌న్న ఉద్దేశంతోనే ప్ర‌వ‌ర్తిస్తున్నారు అని ఆమె నిప్పులు చిమ్మారు.దీనిపై తాను మ‌హిళా క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు. ఇక‌పై న్యాయ పోరాటం కొన‌సాగిస్తాన‌ని, గ‌తంలోనూ త‌నను ఓ సారి ఇదే నాయ‌కుడు అవ‌మానించార‌ని, మ‌నిషి క‌దా మారుతాడు అని అనుకున్నాను కానీ ఈ విధంగా హేయ‌మైన రీతిలో ప్ర‌వ‌ర్తిస్తార‌ని అనుకోలేద‌ని ఆవేద‌న చెందారు.